2 May, 2026 | 3:41 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

09-12-2024 11:36 PM

1,19,952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు 

రైతులకు 181 కోట్ల 83 లక్షల చెల్లింపు 

సన్న వడ్ల రైతులకు బోనస్ కింద 38 కోట్ల 84 లక్షలు జమ 

ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి 

ఖమ్మం (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కొణిజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ  చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 19 వేల మంది రైతుల నుంచి లక్షా 19 వేల 952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, లక్ష 18వేల 220 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు  తరలించామని చెప్పారు. 

జిల్లాలో మొత్తం 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం గోడౌన్ స్ధలం అందుబాటులో ఉందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతులకు మద్దతు ధర కింద మొత్తం 278 కోట్ల 29 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 181 కోట్ల 83 లక్షలు  చెల్లించడం జరిగిందని చెప్పారు. ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. సన్న రకం వడ్లు పండించిన 12,441 మంది రైతులకు బోనస్  కింద ఇప్పటి వరకు 38 కోట్ల 84 లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ధాన్యం రవాణాలో వాహనాల కొరత, హమాలీల సమస్య రాకుండా  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్, మేనేజర్ శ్రీలత, తదితరులు ఉన్నారు.