2 May, 2026 | 2:31 PM

సోనియామ్మకు జన్మదినం - సమగ్ర శిక్షకి - శిక్ష దినం

09-12-2024 11:20 PM

కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ అన్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలంటూ ఆదిలాబాద్ లో గత నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కలెక్టరేట్ ధర్నా శిబిరం నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ, ఏకాశీల పార్క్ వద్ద TSSA ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని, తక్షణమే పే స్కేల్స్ అమలు చేయడం, ఉద్యోగ, జీవన, జీవిత, ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు, తమ గ్యారంటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవ్, ప్రకాష్, దేవదర్శన్, వినోద్, పార్థసారథి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.