13 June, 2026 | 6:11 PM

ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం

13-06-2026 05:28 PM

ఎరువుల దుకాణాల ను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్

షాద్ నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాఘవేంద్ర ఫర్టిలైజర్ తదితర షాపులను వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ పరిశీలించి తనిఖీ చేశారు. అదేవిధంగా నందిగామ మండలంలో ఆయన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ యాప్ పనితీరును, డీలర్ షాపుల వద్ద అమలవుతున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... రైతులు ఎరువుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.  ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చని, దీనివల్ల సమయం ఆదాతో పాటు పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రాథమికంగా ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యలకు తక్షణ పరిష్కారాలు యాప్ అమలులో వస్తున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. యాప్‌లో స్టాక్ కనిపించకపోవడం, వ్యవసాయ విస్తీర్ణం (హెక్టార్లు/ఎకరాలు) నమోదులో వస్తున్న వ్యత్యాసాలు వంటి లోపాలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోందని, డీలర్లు లేదా రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.

గ్రామానికో ముగ్గురు వాలంటీర్లు రైతులకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామానికి ముగ్గురు 'సాయిల్ హెల్త్ వాలంటీర్ల'ను ప్రభుత్వం నియమించిందని విజయ్ కుమార్ తెలిపారు. వీరు గ్రామాల్లో మట్టి నమూనాలను పరీక్షించి తగిన ఎరువుల వాడకంపై రైతులకు సూచనలు ఇస్తారని, అలాగే స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు లేదా యాప్ వాడకం తెలియని వారికి ఎరువులు బుక్ చేయడంలో ఉచితంగా సహాయపడతారని వివరించారు. పూర్తి స్థాయిలో ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎరువుల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.