13 June, 2026 | 7:27 PM

నర్సారెడ్డి జీవితం ప్రజాసేవకే అంకితం

13-06-2026 06:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిస్వార్థంగా పనిచేసిన మహానేత పొద్దుటూరి నర్సారెడ్డి (నర్సన్నబాపు) సేవలు చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పి. నర్సారెడ్డి విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నర్సారెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. స్వర్ణ ప్రాజెక్టు, దోనిగాం ప్రాజెక్టు, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్ ఐటీడీఏ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన  కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.