ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలి
కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, మే 19 (విజయక్రాంతి) : జిల్లాలో ధాన్యం నిల్వ చేయుటకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే గోదాములకు తరలించాలని చెప్పారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా, ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే, ఆ ప్రదేశాలు గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలని వివరించారు. ధాన్యం నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగినన్ని లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డిఎం మార్క్ ఫెడ్ మహేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






