calender_icon.png 15 November, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి అడ్డా..ఆదిభట్ల మున్సిపాలిటీ

15-11-2025 12:00:00 AM

-ఇక్కడ చేయి తడపనిదే ఫైల్ కదలదు 

-అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్..

-తెర వెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు

-తాజాగా భవన నిర్మాణ విషయంలో లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన ఆదిభట్ల టీపీవో

-ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే క్షేత్రస్థాయిలో వెలుగులోకి.. రానున్న మరిన్ని అవినీతి బాగోతాలు

ఇబ్రహీంపట్నం నవంబర్ 14 ( విజయక్రాంతి): కాపాడాల్సిన వాడే కాటేస్తుంటే.. కాపేమి చేయగలడన్న చందంగా ఉంది ఆదిభట్ల మున్సిపల్  అధికారుల తీరు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా  ఆదిభట్ల మున్సిపాలిటీ ఇస్తుందని పలు విమర్శలు వెలువె తున్నాయి. ఇక్కడ ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేస్తూ... అధికారులు అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ కొడుతున్నారు.

ఇక్కడ అధికారులు అవినీతి కంపుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలు ఫిర్యాదులు చేసిన స్పందన లేదని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు టిసిఎస్, ఎరోస్పేస్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఫాక్స్ కాన్, కేన్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏర్పడిన నాటి నుండి ఇక్కడ భూములు, ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

అనుమతులు ఒకలా పొంది.. నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. అంతేకాకుండా భవన నిర్మాణానికి అనుమతులు రానటువంటి భవన యజమానుల నుండి మున్సిపల్ అధికారులు భారీగా వసూలు చేస్తున్నట్లు స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఇదే తరహా ఆదిభట్ల మున్సిపాలిటీలో తాజాగా ఓ నిర్మాణం విషయంలో ఒప్పందం ఆదిభట్ల టిపిఓ బాగోతం బట్టబయలు అయ్యేలా చేసింది. 

పక్కా సమాచారంతోనే ఏసీబీ దాడులు..

రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో 400 గజాల స్థలంలో జీ ప్లస్ 4 భవన నిర్మాణ అనుమతికి మోత్కూరి ఆనంద్ కుమార్  దరఖాస్తు చేసుకున్నారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో అనుమతి రాకపోవడంతో ఆదిభట్ల టిపిఓ బందెల వరప్రసాద్ ను సంప్రదించగా. రూ.1.50 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, ఇదే విషయంపై బాధితుడు ఈ నెల 6న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

కాగా డీఏస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సిటీజోన్ -2 బృందం ఆదిభట్ల కార్యాలయంలో దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వడాలా వంశీకృష్ణ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

తీగ లాగితే డొంక కదిలినట్టు, ఇందులో ప్రధాన సూత్రధారి టీపీవో వరప్రసాద్ ఉండగా, అతను గురువారం కార్యాలయానికి గైర్హాజర్ కావడంతో అతని ఫోన్ లొకేషన్ ద్వారా అతన్ని జిల్లెలగూడలో ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. అయితే టిపిఓ వరప్రసాద్, ఇదివరకు గద్వాల్ జిల్లా జోగులాంబ ఐజాలో పని చేసి 2నెలల క్రితం డిప్యుటేషన్ పై ఆదిభట్ల మున్సిపాలిటీ వచ్చారు.

నిబంధనలు అతిక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు..

టీఎస్ బీపాస్ పేరుతో అనుమతులు పొందిన కొందరు బిల్డర్లు నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమనిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. టీఎస్ బీపాస్ పొందిన సదరు బిల్డర్ నిర్మాణం చుట్టూ సెట్ బ్యాక్ గా కనీసం 5 అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు మించి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి.

కానీ ఇక్కడ అవేమీ పట్టవు అక్రమ నిర్మాణదారులు నిబంధనలకు నీళ్లొదులుతూ సెట్ బ్యాక్ నిబంధన లకు కాలరాస్తూ యథేచ్ఛగా అనుమతులకు మించి జి ప్లస్ 5 అదనపు అంతస్తులు చేపడుతున్నా అరికట్టాల్సిన మున్సిపల్ అధికారులు అవేమిపట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ప్రజాప్రయోజన స్థలం ఆక్రమణ

ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ సమీపంలో ఉన్న శ్లోక కన్వెన్షన్ హాల్ ప్రజాప్రయోజన స్థలంలో ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప అట్టి స్థలాన్ని కాపాడడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారు. ఇటీవల హైడ్రా అధికారులు మున్సిపాలిటీ పరిధిలో నక్షా రోడ్ కబ్జా చేసిన ఐరా విలాస్, మున్సిపల్ గిఫ్ట్ డీడ్ స్థలాన్ని ఆక్రమించిన శ్లోక కన్వెన్షన్ హాల్ ను సందర్శించిన విషయం తెలిసిందే. కానీ వీటిపై కంటి తుడుపు చర్యలుగా భావించడం చూస్తుంటే మున్సిపాలిటీలో అక్రమాలు తారస్థాయి చేరుతున్నాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.