అగ్నిగుండంలా ఆదిలాబాద్
భానుడి భగభగలు.. వేడిగాల్పులు
జన సంచారం లేక నిర్మానుష్యంగా రోడ్లు
నిర్మల్ జిల్లా తానూర్‌లో 45.8, ఆదిలాబాద్ జిల్లా భోరాజ్‌లో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్/ఆదిలాబాద్, మే 16 (విజయక్రాంతి): ముదురుతున్న ఎండలతో ఆది లాబాద్ జిల్లాలో జనం బంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఆదిలాబాద్ అగ్నిగుండంలా మారుతోంది. భానుడి ప్రతాపానికి వేడిగాల్పులు తోడవ్వడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజలు బయటకెళ్లాలంటేనే జంకుతున్నారు.
దీంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్‌లో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్‌లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా సాయం త్రం ఏడు గంటల వరకు వేడిగాల్పులు వీస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలే
ఆదివారం నుంచి మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సూచించింది. శనివారం నిర్మల్ జిల్లా తానూర్‌లో 45.8, ఆదిలాబాద్ జిల్లా భోరాజ్‌లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బీంగల్‌లో 45.3, జగిత్యాల్ జిల్లా గోధూరులో 45.2, కామారెడ్డి జిల్లా ఎలుపుగొండలో 45.1, ఆసిఫాబాద్‌లో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మిగిలిన 27 జిల్లాల్లో 39.9-44.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు నిర్మల్ జిల్లా తానూర్‌లో 41.4 డిగ్రీలు అత్యధికంగా నమో దు కాగా, ఈసారి దానికి మించి 45.8 డిగ్రీలు నమోదవడం గమనార్హం. 45 డిగ్రీలు దాటితే రెడ్ అలెర్ట్, 40-45 మధ్యన నమోదైతే ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు 41-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతాయని వాతావర ణ శాఖ సూచనలు జారీ చేసింది.
నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతూనే వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తా యని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సూచించింది.






