21 April, 2026 | 4:06 AM

పాలన ఆగమాగం

21-04-2026 02:43 AM

బతుకునిచ్చిందే మేం!..

కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమాగం.. ఎటుచూసినా కుంభకోణాలు, భూకబ్జాలే

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

  1. అర్రాసు పాట పాడినట్టు కాంగ్రెస్ హామీలిచ్చింది.. 
  2. పొదరింటిలా.. వడ్డించిన విస్తరిలా రాష్ట్రాన్ని చేతుల పెట్టినం 
  3. మిషన్ భగీరథ నీళ్లు ఏమాయె అని లాగులు తడిసేదాక తన్నాలె.. 
  4. కరెంట్ కాకెత్తుకపోయిందా? ఏం బీమారొచ్చే?
  5. ఎరువులకు రైతులు యాప్‌లు పట్టుకుంటే.. కాళ్ల వాపులొచ్చె 
  6. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. మా మొదటి సంతకం హైడ్రా ఎత్తేసుడు పైనే
  7.  జగిత్యాల సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

* ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతరు. ఆ ఉట్టి పిల్లికి అం దదు. అందుకే పిల్లి శాపం పెడత ది. తాడు తెగాలి. ఉట్టి పడాలి అని. పిల్లి శాపానికి ఉట్టి పడత దా.. పడదు గదా. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా కేసీ ఆర్ చావనే చావడు. ఒకప్పుడు తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉం డేది. మహబూబ్‌నగర్ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలసపోయేటోళ్లు. బతుకాలంటే బతుకపోవాల్సిందే. 

 అధినేత కేసీఆర్

బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఫుల్ జోష్!

‘చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడతది.. గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుంది’ అని ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను గుర్తుచేసుకుంటూ కేసీఆర్ జగిత్యాలలో బీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం బీఆర్‌ఎస్ శ్రేణు ల్లో ఫుల్ జోష్ నింపింది. 

జగిత్యాల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ‘తెలంగాణను ఒక పొదరింటిలా, వడ్డించిన విస్తరిలా అప్పగిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అన్నిటినీ ఆగమాగం చేసింది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయని లాగులు తడిసే దాక కొట్టాలె.. కరెంట్ కాకెత్తుకపోయిందా.. ఏం బీమారొచ్చింది? ఆరు గ్యారెంటీలు కాస్త 420 హామీలయ్యె. వీళ్ల పాలనలో ఎటూ చూసిన భూకుంభ కోణాలు, భూకబ్జాలే ఉంటున్నయ్.

అర్రాసు పాట పాడినట్టు కాంగ్రెస్ హామీలిచ్చె. అవన్నీ ఇప్పుడు మ న్నుల కలిసె. కాంగ్రెస్ పాలనంతా అగమా గం’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని వివేకానంద మైదానంలో సోమవారం ‘ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ముందుగా కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి మెడలో గులా బీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడే వారిని పోలీసులు పట్టుకుపోవడమే నడుస్తున్నదని దుయ్యబట్టారు. పంచాయతీలను నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కూపం చేశారని మండిపడ్డారు. ‘అందుకే కాంగ్రెస్ పోవాలి.. ప్రజలు నిలిచి గెలవాలి. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం.. ఉద్యోగస్తులు ఆగమాగం.. రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం.. విద్యార్థుల జీవితం ఆగం.. ఆటో కార్మికుల జీవితాలు ఆగం.. రాష్ట్రంలో ఎవరూ సక్కగ లేరు. ఎరువల కోసం రైతులు యాప్‌లంటూ కాళ్లకు వాపులొచ్చెటట్లు తిరుగుతున్నారు’ అంటూ వాపోయారు. యూరియా బస్తాల కోసం క్యూలైన్ల మల్లా చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం

కాంగ్రెస్ అందానికి బోడి హైడ్రా ఒకదానిని తీసుకొచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని, నిజామాబాద్‌కు నిడ్రా తీసుకొస్తామని పీసీసీ నేత ఒకరు చెబుతున్నారని, రేపు జగిత్యాలకు జిడ్రా అంటాడని చమత్కరించారు. పేదోళ్ల కొంపలు కూల్చడమే హైడ్రా పని అని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో మూడున్నర లక్షల మందికి పట్టాలిచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లా అధికారంలోకి వస్తుందని, అప్పుడు మొదట ఎత్తి అవతల పడేసేది హైడ్రానే అని ప్రకటించారు.

మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో 46వేల చెరువులు మంచిగ ఉండేవని, తాము ఒక్క గుడిసెనైనా కూలగొట్టలేదని గుర్తుచేశారు. మూసీ వద్ద ఉండే గరీబోళ్లను ఏడిపించడం ప్రభుత్వానికి ఏం ఆనందమని మండిపడ్డారు. గరిబోళ్లకు పొద్దున లేస్తే నిద్రపోకుండా, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 వేల ఇళ్లు కూలగొడతామని అంటున్నారని, అది ధర్మమేనా అంటూ నిలదీశారు.

మూసీని మంచిగ చేయాల్సిందేనని, కానీ ఇళ్లు కూలగొట్టుడు ఎందుకని నిలదీశారు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప అందులో ఏమీ లేదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని, నాడు ‘నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనని చెప్పా’ అని గుర్తుచేసుకున్నారు. ‘మీటర్లు పెట్టకపోతే 30 వేల కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నారని, అన్నట్లుగానే కట్ చేశారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30 వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో మళ్లీ మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలు ఇప్పించామని.. ఇప్పుడొస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని, ఇప్పుడు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే.. పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు.

భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని, మొత్తానికే ఎగ్గొట్టారని అన్నారు. ఇంట్లో ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరిట నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారని, అది నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.  పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కాంగ్రెసోళ్లు అంటున్నారని, ఎవరు వెయ్యి జన్మలెత్తినా తాను చావనని పేర్కొన్నారు. 

పిల్లి శాపాలేం చేస్తయి?

చెరువుల బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా దీనిలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తాము వట్టిమాటలు, గఫ్ఫాలు కొట్టుడు కాకుండా ఎన్నో మంచి పనులు చేశామని తెలిపారు. ఐదేళ్లలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి, ప్రతి ఇంటికి నల్లా పెట్టించామన్నారు. మారుమూల పల్లెల్లకూ నీళ్లు ఇచ్చామని చెప్పారు.

మరి ఇప్పుడు ఏం బీమార్ పుట్టిందని ప్రశ్నించారు.‘నీళ్లు రావాలంటే.. లాగులు పలిగేదాకా సంపాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతరు. ఆ ఉట్టి పిల్లికి అందదు. అందుకే పిల్లి శాపం పెడతది. తాడు తెగాలి. ఉట్టి పడాలి అని. పిల్లి శాపానికి ఉట్టి పడతదా.. పడదు గదా. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా కేసీఆర్ చావనే చావడు’ అంటూ వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.

తిరోగమన పాలన: జీవన్‌రెడ్డి

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని అనుకున్నామని, కానీ తిరోగమనంగా రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా ఉన్నదని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు కేసీఆర్ తో కలిసి పనిచేయడం ఆనందంగా భావిస్తున్నానని తెలంగాణ అభివృద్ధిలో ఇద్దరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని విద్యుత్తు, నీళ్లు, రోడ్లు.. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కేసీఆర్ మహా మేధావి అని, ఆయన్ను మించిన నాయకుడు ఇప్పటికీ లేరని కొనియాడారు. ఒక ప్రాంతీయ పార్టీతో జాతీయస్థాయిలో తన ముద్ర వేసుకున్న నాయకుడు కేసీఆర్ అంటూ కితాబునిచ్చారు.

నాడు గడ్డు పరిస్థితులు

వచ్చే సారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది నూటినూరు శాతం మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని, నాటి పరిస్థితులు చూస్తే ఇప్పటికీ దుఖం వస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి అంటూ నాటి గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్న జగిత్యాల, మెట్‌పల్లి, చొప్పదండి ప్రాంతాల నుంచి కూడా దుబాయికి, బొంబాయికి వలసలు ఉండేవన్నారు.

ఇక పాలమూరు జిల్లాలోనైతే గంజి కేంద్రాలు ఉండేవి. నాడు కొన్ని పార్టీలు చేసే పని చూస్తే బాధ కలిగేది. మహబూబ్‌నగర్ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలసపోయేటోళ్లు. బతుకాలంటే బతుకపోవాలె. లేదంటే.. అక్కడ బతుకు లేదు. ఇంటికాడ ఉన్న ముసలోళ్లకు వాళ్లు డబ్బులు పంపిస్తే రేషన్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అండ్ల కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పపని చేసినట్టు గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు.

అంత అద్వాన స్థితికి తెలంగాణను దిగజార్చాయి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఆ పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ నాటి ఉమ్మడి ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచిండు. నేడు నేనొక ఉత్తరం రాసిన. కరెంట్ చార్జీల పెంపుదల వాపసు తీసుకోవాలని. కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్‌కు వస్తే పట్టపగలు 11:30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు’ అంటూ కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేయాల్సిందేనని, అందుకు ప్రజలందరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు సంజయ్ గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు