ఆధారాల కోసమే అఫిడవిట్లు!
ప్రతీదీ రికార్డు రూపంలో ఉండాలి
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వెల్లడి
కాళేశ్వరం నిర్మాణ ఏజెన్సీల విచారణ
నెలాఖరులోగా అఫిడవిట్లు ఇవ్వాలని ఆదేశం
విజిలెన్స్, కాగ్‌లను కూడా విచారిస్తామని వెల్లడి
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ ఏం జరిగింది? ఎలా చేశారు? ఎవరెవరు ఉన్నారు? ఎంత నష్టం జరిగింది? అనే సమాచారమంతా స్పష్టంగా తెలియాలంటే సరైన ఆధారాలు కావాలని, ఆ ఆధారాల కోసమే అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశిస్తున్నామని ఈ ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది.
ఎవరు ఏం చెప్పినా.. ప్రతీదీ స్పష్టమైన రికార్డు రూపంలో ఉండాలని కమిషన్ ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఏజెన్సీలను కమిషన్ బుధవారం విచారించింది. ఏజెన్సీలు ఇచ్చిన సమాచారమంతా అఫిడ విట్ రూపంలో దాఖలు చేయాలని పీసీ ఘోష్ ఆదేశించారు. బరాజ్‌ల నిర్మాణం, డిజైన్లు, మెయింటెనెన్స్ తదితర అంశాలవారీగా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా టైం బౌండ్ గురించి ఏజెన్సీలు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు పీసీ ఘోష్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టును పూర్తిచేసి అందించినట్టు ఏజెన్సీలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ నెలాఖరులోపు అఫిడవిట్ల రూపంలో సమాధానం ఇవ్వాలని ఏజెన్సీలను ఘోష్ ఆదేశించారు.
విజిలెన్స్, కాగ్‌ను కూడా విచారిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా కాగ్, విజిలెన్స్ అధికారులను కూడా విచారించనున్నట్టు కమిషన్ స్పష్టంచేసింది. ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ నుంచి నివేదిక ఇప్పటికే కమిషన్‌కు అందింది. కాళేశ్వరంలో పనుల విషయంలోనే కాకుండా.. భారీగా వ్యయం చేయడాన్ని, అందు లో అవకతవకలు జరిగాయనే కోణం లో కాగ్ నివేదిక వచ్చినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ సారధ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వా నికి విజిలెన్స్ శాఖ పంపించింది. పూర్తిస్థాయి విచారణ చేస్తుండగానే విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ గుండెపోటుతో మరణించారు. దీంతో విజిలెన్స్ విచారణ స్థంభించింది. ఇదే సందర్భంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. కాగ్ నివేదికతో పాటు.. విజిలెన్స్ నివేదికను కూడా కమిషన్ తెప్పించుకుంది. ఈ రెండు నివేదికల్లో పేర్కొన్న అంశాలను కమిషన్ పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్, కాగ్‌ను కూడా విచారిస్తామని కమిషన్ పేర్కొంది.
వాళ్లనూ పిలుస్తాం
ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి అనే కోణంలో ఏజెన్సీల నుంచి రికార్డు రూపంలో సమాధానం వచ్చిన తరువాత.. అందులో గుర్తించినవారిని కూడా విచారణకు పిలుస్తామని జస్టిస్ ఘోష్ తెలిపారు. ఇప్పటివరకు విచారణకు వచ్చిన వారి నుంచి అఫిడవిట్లు వచ్చాక.. ఇతర వ్యక్తులను కూడా పిలుస్తామని చెప్పారు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లను కూడా విచారణకు పిలుస్తామని వెల్లడించారు.






