వలపు వల.. జేబు గుల్ల
డేటింగ్ యాప్‌లతో ఓ ముఠా చీటింగ్
యువకులను పబ్‌లకు తీసుకెళ్లి మోసం
ఏడుగురిని కటకటాలకు పంపిన పోలీసులు
8 ఫోన్లు, 2 కార్లు, రూ.40 లక్షలు సీజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): డేటింగ్ యాప్‌లతో వలపుల వల వేసి అమాయకుల జేబులను గుల్ల చేసిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు పరారైన డేటింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్టు బుధవారం వెల్లడించారు.
ఢిల్లీలో డెవిల్ నైట్ అనే క్లబ్‌ను నిర్వహించే ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువతులను వారి గ్రూప్‌లో చేర్చుకొని పేర్లు మార్చి డేటింగ్ యాప్స్, సైట్స్‌లో ఫొటోలు పెట్టి యువకులతో చాటింగ్ చేయించారు. డబ్బున్న అబ్బాయిలను ట్రాప్‌చేసి దగ్గరలోని మోష్ పబ్‌లకు తీసుకెళ్లేవారు. ఆయా పబ్‌లలో ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తోపాటు అనేక సౌకర్యాలు కల్పించేవారు.
డెవిల్స్ నైట్ పేరుతో ప్రత్యేక మెనూను యువతితోపాటు వచ్చిన కస్టమర్‌కు ఇస్తారు. అక్కడ ఖరీదైన మద్యం, ఆహారాన్ని ఆర్డర్ చేయి స్తారు. బిల్లింగ్ అయ్యే సమయానికి సదరు యువతి అక్కడి నుంచి పరారవుతుంది. ఆ తర్వాత ఆర్డర్ ప్రకారం పబ్ నిర్వాహకులు అధిక బిల్లు వేసి ఆ అమాయక కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అనంతరం ఆ మొత్తాన్ని ఈ గ్రూప్ యువతి, పబ్ నిర్వాహకులు పంచుకుంటారు. నెల రోజుల తర్వాత మరో ప్రాంతానికి వెళ్లిపోతారు.
దోపిడే లక్ష్యం
ఇలా ఈ ముఠా సభ్యులు 45 రోజుల్లో, దాదాపు 50 మంది వ్యక్తులను మోసం చేసి వారి వద్ద నుంచి రూ.40 లక్షలు దోచుకున్నారు. హైదరాబాద్ నుంచి పారిపోయి మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ఇదే తరహాలో మోసం చేయబోతుంటే పోలీసులు పట్టుకున్నారు. ఇదే ముఠా ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నష్టాల్లో ఉన్న, గూగుల్ రేటింగ్ తక్కువ ఉన్న పబ్‌లను మాత్రమే వారు ఎంచుకొనేవారు. ఈ మోసాలకు వారు టిండర్, హింజ్, బాంబెల్ వంటి యాప్‌లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలోని కీలక వ్యక్తులు ఆకాశ్‌కుమార్, సూరజ్‌కుమార్, అక్షత్ నరుల, తరుణ్, శివరాజ్‌నాయక్, రోహిత్‌కుమార్, చిర్కుపల్లి సాయికుమార్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 ఫోన్లు, 2 కార్లు (థార్, కియా) స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 406, 419, 420 కింద కేసు నమోదు చేశారు. అమ్మాయిలను ఎరగా వేసి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్టు నగరంలోని మోష్ పబ్‌లో మోసపోయిన ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందించండి
డేటింగ్ యాప్‌ల ద్వారా అమ్మాయిలతో కలిసి మోసం చేస్తున్న ముఠాల వివరాలను 100, 9490617182 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని, సైబరాబాద్ కమిషనరేట్ నంబర్ 9490617444కు వాట్సాప్ ద్వారా కూడా తెలపవచ్చని పోలీసులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.






