ఏపీకి బీపీసీఎల్ రిఫైనరీ?
అవకాశాలను పరిశీలిస్తున్న కంపెనీ
50 వేల కోట్లతో కొత్త రిఫైనరీ ఏర్పాటు
పరిశీలనలో ఏపీ, గుజరాత్, యూపీ
ఏపీకి వస్తే వేల మందికి ఉద్యోగాలు
హైదరాబాద్, జూన్ ౧౨ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఓ శుభవార్త బయటకొచ్చింది. ఏపీలో భారీ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆలోచిస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ పరిశీలిస్తున్న మూడు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉన్నదని తెలిసింది. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్ను ల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కోసం 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఏదో ఒకచోట రిఫైన రీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. దీనిపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్టు చేసింది. బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ ఇటీవల ఈ విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్రణాళిక వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి.






