ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు
- 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ
- ఉత్తర్వులు ఏడాది పాటు అమలు
- యూనిఫామ్ సర్వీసులకు వర్తించదు
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిం ది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితి సడలింపు ఏడాది పాటు అమల్లో ఉండనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పోలీసు తదితర యూనిఫామ్ సర్వీస్‌లకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నోటిఫికేషన్ల జాప్యం కారణం గా గత ప్రభుత్వం ఉద్యోగార్థుల వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ 2022 మార్చి 3న జీవో నం.42 జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వయో పరిమితిని 46 ఏళ్లకు పొడిగిస్తూ 2024 ఫిబ్రవరి 8న జీవో నెం.30 జారీ చేసింది. ఈ జీవో గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు వయో పరిమితిని మళ్లీ 34 నుంచి 44 సంవత్సరాలకు సడలింపునిస్తూ తాజాగా జీవో నెం.86ను విడుదల చేసింది.
నియామకాల ఆలస్యం, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని, వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సడలింపు యూనిఫామ్ సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైలు, అటవీ శాఖల ఉద్యోగాలకు వర్తించదని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీలకు ఎప్పటిలాగే యథావిధిగా అదనపు సడలింపు ఉంటుందన్నారు.






