20 May, 2026 | 2:13 AM

అన్యాయాన్ని సరిదిద్దుతాం

20-05-2026 12:58 AM

పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయనడంలో వాస్తవం లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, సీతార మా ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, త్రాగు నీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టంచేశారు.

మంగళవారం సచివాలయంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలసి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మణాల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో  ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు  చెందిన ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి,  వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్‌సీ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పదేళ్ల  పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దెందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటుచేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షా సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అందుకుగాను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

చెరువులలో పూడిక తీత..

పెద్దఎత్తున మట్టి పేరుకపోయి నీటి సామర్ధ్యం నిలువ 8 టీఎంసీల దిగువకు పడిపోయిన జూరాల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ పూడికతీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డీఆర్‌ఐపీ (డ్యామ్ రీహబిలేషన్ అండ్ ఇంప్రూమెంట్ ప్రాజెక్టు)కు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. డీఆర్‌ఐపీ కింద చేపట్టనున్న పూడికతీత పనులతో నీటి సామర్ధ్యం నిలువలు గణనీయంగా పెరగడమే కాకుండా రిజర్వాయర్ భద్రత ,నిర్వహణ మరింత మెరుగు పరుస్తామన్నారు.

అదేవిధంగా చిన్నతరహా సాగునీటి చెరువులలో వర్షా కాలానికి ముందే పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ప్రధానంగా పాలమూరు- ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి అయ్యాయంటూ బీఆర్‌ఎస్  నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని,  ఆ ప్రచారం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని మంత్రి  మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టు ఆఫ్ టెక్‌ను జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు మార్చడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు.

భూసేకరణ జరపకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్క్ కు టెండర్లు పిలిచి చేతులు దులుపుకొన్నారని మంత్రి మండిపడ్డారు. పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసి తొలి దశలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 1,226 గ్రామాలకు త్రాగునీరు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సహా అనుబంధంగా ప్రాజెక్టులు పూర్తిచేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.