తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ విజయవంతం
చండ్రుగొండ,(విజయక్రాంతి): తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యోగ హక్కుల కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ బంద్‌లో భాగంగా మండలంలో బుధవారం బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాల్లో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. జీవో నం.3తో సహా షెడ్యూల్డ్ ప్రాంతంలోని 29 శాఖల ఉద్యోగాలను కలిపి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జీవో నం.109 ప్రకారం 75 శాతం వాటాను ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా DSC నిర్వహించాలని, ITDAల ద్వారా ఏజెన్సీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంత ఆదివాసి యువతకు ఉద్యోగాలలో న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఉద్యోగ అవకాశ పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మహిళా జిల్లా అధ్యక్షురాలు పాయం మాధవి, మండల అధ్యక్షులు కొడెం నరసింహారావు, ఉపాధ్యక్షులు కుంజా వెంకటేష్ దొర, పద్దం రమేష్ తదితరులు పాల్గొన్నారు.






