19 August, 2026 | 4:08 PM

ఉప్పల్ భగాయత్ అభివృద్ధి బాధ్యత నాది: పరమేశ్వర్ రెడ్డి

19-08-2026 03:27 PM

రూ.3.50 కోట్లతో మల్టీ స్పోర్ట్స్ అరేనా పరిశీలన

త్వరలో రూ.35 కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ భగాయత్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భగాయత్ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకొచ్చి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. బుధవారం ఉప్పల్ భగాయత్‌లో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పోర్ట్స్ అరేనాను పరమేశ్వర్ రెడ్డి స్థానిక కాలనీవాసులు, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ స్పోర్ట్స్ అరేనాలో బేబీ పూల్, స్విమ్మింగ్ పూల్, ట్రిపుల్ జంప్, ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ వంటి ఆధునిక క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బహుళ క్రీడా సముదాయం అందుబాటులోకి వస్తే యువతకు మెరుగైన క్రీడా వేదిక లభించడంతో పాటు భగాయత్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.భగాయత్‌లో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే రూ.35 కోట్ల వ్యయంతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.