పత్తి రైతులు రక్షక పంటలు సాగు చేయాలి
మందమర్రి,(విజయక్రాంతి): ప్రతి సాగు చేసే రైతులు పంటను కాపాడుకునేందుకు రక్షక పంటలుగా జొన్నలు, మొక్కజొన్న పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Agricultural Extension Officer Mutyam Tirupati) సూచించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయ తీ పరిధిలోని రైతులకు పత్తి సాగులో సమగ్ర కీటక యాజమాన్యంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పత్తి సాగు చేసే రైతులు తమ పొలం చుట్టూ రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న వంటి పంటలు రెండు మూడు వరసల్లో నాటడం ద్వారా పంటకు కీడు చేసే పురుగుల దాడికి రక్షక పంటలు ఉప యోగపడి ప్రధాన పంటను శత్రువుల భారీ నుండి రక్షిస్తాయని అన్నారు.
పత్తిలో ఎరపంటలుగా బెండ, బంతి వంటి పంటలు 10 వరుసలకు ఒక వరుస నాటడం వల్ల అవి కాయ తొలుచు, రసం పీల్చే పురుగులను ఆకర్షించి పురుగు ఉధృతిని నివారించడంలో తోడ్పడతాయని తెలిపారు. అదేవిధంగా అంతర పంటలుగా కంది, పెసర వంటి పప్పు ధాన్య పంటలు ఐదు నుంచి పది వరుసలకు ఒక వరుస నాటితే శత్రు పురుగు లను ఆకర్షించడంతో పాటు మిత్ర పురుగులకు కూడా ఆవాసంగా ఉపయోగపడ తాయని స్పష్టం చేశారు. ప్రధాన పంట ద్వారా నష్టం జరిగితే అంతర పంటల ద్వారా కొంత మేరకు ఆదాయాన్ని పొందవచ్చునని, నత్రజని స్థిరీకరణ జరిగి భూసారం కూడా పెరుగుతుందని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని పత్తి రైతులు ఎర పంటలు, రక్షక పంటలు, అంతర పంటలు సాగుచేసి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుతూ, రసాయనిక పురుగు మందుల ద్వారా జరిగే అధిక ఖర్చులను తగ్గించుకొని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించే దిశగా పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు జుంబిడి రాజన్న, భారతపు తిరుపతి, సలేంద్ర పోషమల్లు, దాడి కుమార్, మల్లేష్ లు పాల్గొన్నారు.






