15 July, 2026 | 12:18 AM

చిత్రసీమలో ఏఐ మేకింగ్స్

08-12-2024 12:00 AM

ఏ సహాయం కావాలన్నా సిరినో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్‌నో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్ సెక్రెటరీల్లాగా తయారైన ఆ యాప్స్ పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతోనే మరి. ‘ఇందుగలడు అందు లేడను సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందు గలడు శ్రీహరి’ అన్న చందంగా ఇప్పుడు ఏఐ కూడా అన్ని రంగాల్లోనూ సేవలందిస్తోంది.

సినీరంగంవారైతే సాధ్యమైనంత మేర ఏఐ సేవలనే వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హిందీ సినిమా ప్రొడక్ట్ అంతా ఏఐ మేకింగ్స్ అనే చెప్పాలి! సినిమా నిర్మాణ విభాగంలో తెరవెనుక శ్రమించే సాంకేతిక నిపుణులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. 

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ సినీ పరిశ్రమలో తనదైన పాత్ర పోషిస్తోంది. చిత్ర నిర్మాణంలో కీలకమైన పూర్వ నిర్మాణ పనులు, పోస్ట్ -ప్రొడక్షన్ దశల్లో ఏఐ పరికరాలను ఉపయోగించేందుకే మేకర్స్ ఇష్టపడుతున్నారు. తద్వారా మేకర్స్ సమయం వృథా కాకుండా ఉంటోంది. ఖర్చులు సైతం ఆదా చేయడంలో దోహదపడుతోందీ ఏఐ.

చిత్ర పరిశ్రమలో ఏఐ సేవలు విస్తరిస్తున్న తీరును అంచనా వేసే క్రమంలో ఓ సంస్థ ఏఐ నిపుణులను పలకరించింది. ఈ సందర్భంగా వారు ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలను చెప్పటం గమనార్హం. ఓ సినిమా నిర్మాణంలోని అన్ని విభాగాల్లోనూ ఏఐ సేవలు పెరిగిపోతున్నాయనేది వారి మాటల్లో తెలుస్తోంది. 

సమీప భవిష్యత్తులో మరింత విస్తృతంగా..  

సినిమా నిర్మాణ రంగ ప్రముఖులు చెప్తున్న ప్రకారం.. రాబోయే రెండు మూడేళ్లలో సినీ ఇండస్ట్రీలోని సుమారు 50 శాతం మేకర్స్ ప్రస్తుతం ఏఐ సేవలను ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే 20 నుంచి 25 శాతం వరకు సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ పనులు ఏఐ సహాయంతోనే చేస్తున్నారు.

రాబోయే రెండేళ్లలో ఏఐ వినియోగం మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. తద్వారా మునుపటి కన్నా 40 శాతం సమయం ఆదా అవుతుందని చెప్తున్నారు. ఈ ఏఐ వినియోగం తర్వాత ఖర్చులు.. పాత పద్ధతిలో కన్నా నాలుగో వంతు తగ్గిందంటున్నారు. మరో 25 నుంచి -30 శాతం ఖర్చులు ఆదా చేసే రోజులు మరెంతో దూరంలో లేవని కూడా నమ్మకంగా చెప్తున్నారు.  

సాంకేతిక విభాగంలోనే ఎక్కువ.. 

ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ సాధ్యమైనంతమటుకు ఖ ర్చులను తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ఈ క్ర మంలో ఏడాదిన్నర కాలంగా వివిధ దశల్లో ఏఐ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రీ -ప్రొడక్షన్ నుంచి స్టోరీ బోర్డింగ్, గ్రాఫిక్ లుక్, స్క్రిప్టింగ్, పోస్టర్ (స్టిల్స్), కాస్టింగ్, సెట్ డిజైన్, కాస్ట్యూమ్ వరకు వీలైనంత ఎక్కువగా ఏఐని వాడేస్తున్నారు. ఆయా విభాగాల సమాచారాన్నంతటికీ క్రోడీకరిస్తూ, అన్ని విభాగాల్లో మెరుగైన ఫలితాలను అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని మేకర్స్ చెబుతున్నారు. 

టెక్నీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇటీవల ఓ జాతీయ సంస్థతో టెక్నీషియన్లు ముచ్చటిస్తూ చెప్పిన విషయాలు ఏఐ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయనటానికి బలం చేకూర్చుతున్నాయి. అనుభ వజ్ఞుడైన ఎడిటర్‌గా పేరున్న పోస్ట్ ప్రొడక్షన్ నిపుణుడు దేబాషిస్ దాస్ మాట్లాడుతూ ‘నేడు హిందీ చిత్ర పరిశ్రమలోని అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి’ అని చెప్పారట. 

ఆలోచనకు దగ్గట్టుగా.. 

తీయబోయే సినిమాకు సంబంధించి ప్రాథమిక దశ పనుల్లో కీలక పాత్ర పోషిస్తోందట ఏఐ. అంటే ప్రారంభ దశలో ముఖ్య ఘట్టంగా భావించే ఆలోచన, భావనకు సంబంధిత విషయాల్లోనూ ఏఐ ఉపయుక్తంగా ఉంటుండటం విస్మయానికి గురిచేస్తోంది. ప్రముఖ రాయ్ కపూర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఇదే విషయాన్ని తనను పలుకరించిన మీడియాకు వెల్లడిస్తూ.. ‘ప్రస్తుతం నిర్మాణ సంస్థలు, దర్శకులు, రచయితలు.. తాము అనుకున్న కాన్సెప్ట్‌లు, ఆలోచనలను రూపొందించడంలో ఏఐ సాధనాన్ని ఉపయోగించడం నేను చూస్తున్నాను. కోరుకున్న పద అర్థాన్ని, భావాన్ని కనుక్కొనే క్రమంలో ఏఐ బాగా ఉపయోగపడుతోంది’ అని వివరించారు. 

అప్పుడు ఏడాది.. ఇప్పుడు 10 గంటల్లోనే.. 

ఏఐ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిల్లో స్టోరీ బోర్డింగ్ (సీన్ విజువల్ రిప్రజెంటేషన్) మరో ముఖ్య దశ అని చెప్పవచ్చు. మలయాళ భాషలో 60 చిత్రాలకు ఏఐ టెక్నాలజీ సేవలను అందించిన ‘డీ.కల్ట్ స్టూడియో’ వ్యవస్థాపకుడు గోకుల్ ఏ దీని గురించి మాట్లాడుతూ.. “ప్రీ-ప్రొడక్షన్ దశలో ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియలో స్టోరీబోర్డింగ్ ఒకటి. ‘జోధా అక్బర్’ చిత్రానికి (2008) సంబంధించి స్టోరీబోర్డింగ్ కోసం మేకర్స్‌కు ఒక సంవత్సరం సమయం పట్టింది.

అదే ఈ రోజు ఏఐ సాధనాన్ని ఉపయోగించి అదే ఆర్టిస్ట్  స్టోరీబోర్డ్ డ్రాయింగ్‌లు ఎనిమిది నుంచి 10 గంటల్లోనే చేసేస్తున్నాడు” అని చెప్పారు. ‘స్టోరీబోర్డింగ్‌లో సాధారణంగా వాడే స్కెచ్‌లకు బదులుగా ఏఐ టెక్నాలజీలో రంగులు, లైటింగ్‌తో చిత్రాలను రూపొందిస్తున్నందున మెరుగైన అవుట్‌పుట్ కూడా వస్తోంది’ అని కూడా ఆయన తెలిపారు. 

పీరియాడికల్ ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ టూల్స్ అమోఘమైన పాత్ర 

ఏఐ పరికరాలతో ఉన్న మరో ఉపయోగం ఏంటంటే.. 

సినిమా నిర్మాణంలో వాడే కెమెరా రకం, లెన్స్‌లు, షాట్‌ల గురించి సాపేక్షంగా సరైన ప్రాంప్టింగ్‌లను అందిస్తా యట. చాలా వరకు ఈ సాధనాలు ‘2డీ’ చిత్రాన్ని ‘3డీ’కి మారుస్తాయి. ఈ విషయాన్ని డీ.కల్ట్ స్టూడియోకు చెందిన గోకుల్ ఏ స్పష్టం చేస్తూ.. ‘సెట్ డిజైన్ గురించి స్పష్టమైన ఆలోచనను అందించడంలో ఏఐ పరికరాలు గొప్ప సహకారం అందిస్తాయి. ఈ రోజుల్లో పీరియాడికల్ ఫిల్మ్‌ను తీయడం చాలా సులభతరం కావడానికి ఏఐ టూల్స్ ఒక ముఖ్య కారణం’ అని చెప్పారు.