రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏఐకేఎంఎస్ ధర్నా
07-08-2026 06:41 PM
ఆలేరు,(విజయక్రాంతి): రైతులకు వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ... రైతులకు అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.






