19 June, 2026 | 3:25 AM

ఖండాంతరాలు దాటిన కల్వకుర్తి ఖ్యాతి

19-06-2026 01:53 AM

ఐదేళ్లలో 5,000 మంది యువతకు ఐటీ, ఏఐ ఉచిత శిక్షణ

అమెరికా సంస్థ ‘ఇన్ఫో డాట్ గ్లోబల్’తో ఐక్యత ఫౌండేషన్ ఒప్పందం

ఆమనగల్లు, జూన్ 18 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గాన్ని సరికొత్త స్కిల్ హబ్గా మార్చేందుకు సరిహద్దులు దాటిన సరికొత్త వ్యూహం సిద్ధమైంది. స్థానిక గ్రామీణ యువతకు ప్రపంచస్థాయి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, అంతర్జాతీయ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘ఐక్యత ఫౌండేషన్’ కీలక అడుగు వేసింది.

అమెరికా పర్యటనలో ఉన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  యూఎస్‌ఏకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ‘ఇన్ఫో డాట్ గ్లోబల్ ఇంక్’ (ఐగిఐ ) తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గంలోని 5,000 మంది యువతీ యువకులకు ఈ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ద్వారా ఉజ్వల భవిష్యత్తును అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఐటీ, ఏఐ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ..

ప్రస్తుత ఆధునిక కాలంలో గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న సబ్జెక్టులపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇన్ఫో డాట్ గ్లోబల్ ఇంక్ ఫౌండర్ & సీఈఓ మల్లారెడ్డి బృందంతో జరిగిన ఈ సమావేశంలో శిక్షణా ప్రణాళికను ఖరారు చేశారు. ఇందులో భాగంగా కింది అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

అధునిక సాంకేతిక పరిజ్ఞానం: 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అడ్వానస్డ్ ఐటీ కోర్సులు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే మెళకువలు, డిజిటల్ టూల్స్ వి నియోగంపై పూర్తి అవగాహన.జాతీయ, అం తర్జాతీయ కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ అవకాశాలపై మార్గదర్శకత్వం.

 గ్రామీణ యువతకు వరం: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాంత గ్రామీణ యువతలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందన్నారు. సరైన వేదిక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే వారు ప్రపంచస్థాయిలో రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో నగరాలకే పరిమితమైన కార్పొరేట్ స్థాయి శిక్షణను, కల్వకుర్తి యువతకు ఉచితంగా అందించి వారిని గ్లోబల్ లీడర్లుగా మార్చడమే ఐక్యత ఫౌండేషన్ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ శిక్షణ ద్వారా నియోజకవర్గంలోని వేలాది కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండుతాయని ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గంలో హర్షాతిరేకాలు..

కల్వకుర్తి నియోజకవర్గ యువత భవిష్యత్తు కోసం అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధి అవకాశాల కోసం నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, అంతర్జాతీయ స్థాయి శిక్షణను స్థానికంగానే అందుబాటులోకి తెస్తుండటం పట్ల నియోజకవర్గ యువత, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.