26 August, 2026 | 12:48 PM

ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులుగా మల్లేష్ ఎన్నిక

26-08-2026 12:04 PM

కూసుమంచి, ఆగస్టు 26విజయక్రాంతి): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జిల్లా ఉపాధ్యక్షులుగా కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామానికి చెందిన గుండెపంగు మల్లేష్ ఎన్నికయ్యారు. ఈనెల 23, 24వ తేదీలలో సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీప్రసన్న గార్డెన్స్ లో రెండు రోజులపాటు జరిగిన ఏఐటీసీ జిల్లా 17వ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మల్లేష్ మాట్లాడుతూ.. ఏఐటియుసి ద్వారానే కార్మికులకు, కార్మికుల చట్టాలకు రక్షణ ఉంటుందని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనీ పోరాడింది ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు.

రాబోయే రోజులలో కార్మికుల హక్కులు, వారి పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేపడతామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు జిల్లాలో ఏఐటియుసి బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల పొట్ట గొట్టే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన ఏఐటియుసి రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, సీపీఐ జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా సీపీఐ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ సంగబత్తుల వెంకటరెడ్డి స్ఫూర్తితో మల్లేష్ 2010లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ద్వారా ప్రస్థానం మొదలుపెట్టి సంఘంలో మండల, డివిజన్, జిల్లా బాధ్యతలు నిర్వర్తించి, అప్పటి సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు సూచనల మేరకు పార్టీ సీపీఐ కూసుమంచి మండల కార్యదర్శిగా రెండు దఫాలుగా సేవలు అందించి, ప్రస్తుతం సీపీఐ జిల్లా సమితి సభ్యులుగా కొనసాగుతూ.. తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ ఎన్నికతో మండలంలోని సీపీఐ, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు మల్లేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.