వాయు కాలుష్యాన్ని అరికట్టాలి!
ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కాలుష్యానికి ప్రధాన కారణాలు.. వాహనాల సంఖ్య పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను కాల్చడం, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణాల నుంచి వెలువడే దుమ్ము, చెత్తను కాల్చడమే. అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఆరావళి పర్వతాలు ఒకటి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్నాయి. థార్ ఎడారి తూర్పుకు విస్తరించకుండా అడ్డుకుంటూ, భూగర్భజలాలను పునరుద్దరిస్తూ, వన్యప్రాణులను సంరక్షిస్తూ, చుట్టూ ఉన్న రాష్ట్రాలకు ప్రాణవాయువును అందిస్తుంది.
ఈ మధ్యే వెలువడిన కోర్టు తీర్పు వల్ల గనుల తవ్వకానికి మార్గం సుగమం కావడం వాయు కాలుష్యం పెరుగదలకు కారణమవుతోంది. ఎన్ని రకాల చట్టాలున్నప్పటికి అందులోని లొసుగులను వాడుకుంటున్న అధికారులు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తప్పు మీదంటే మీది అంటూ దూషణలకు దిగుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్ మనుగడ కష్టమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరముంది.
సైదులు, తిరుమలగిరి






