calender_icon.png 9 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నావ్ కేసులో న్యాయం గెలిచేనా?

08-01-2026 12:00:00 AM

ఉన్నావ్ అత్యాచార కేసు ప్రధాన ముద్దాయి, బీజేపీ మాజీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పడిన యావజ్జీవ శిక్షను ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేయడం సంచలనం కలిగించింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేరస్థుడి శిక్షను ఏ సందర్భాల్లో సస్పెండ్ చేయవచ్చనే అంశాన్ని చట్టపరంగా విశ్లేషించాల్సి ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ ప్రాంతంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అనేకసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు సెంగార్‌పై కేసు నమోదైంది. బాధితురాలి తండ్రిపై అక్రమ కేసులు పెట్టి, పోలీస్ కస్టడీలోనే దాడి చేయించి ప్రాణాలు తీయించాడు.

కేసులో నిందితుడిగా తేలిన సెంగార్‌కు ఢిల్లీ ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో పదేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శిక్షకాలం మూడేళ్ల కంటే తక్కువ ఉంటేనే బెయిల్, సస్పెన్షన్ సులభంగా లభిస్తాయి. కానీ సెంగార్‌ది యావజ్జీవ శిక్ష. 2019 నుంచి చూసుకున్నా కనీసం పదేళ్ల శిక్షకాలం పూర్తి కాకుండానే సెంగార్‌కు వెసులుబాటు కల్పించడం నిబంధనలను ఉల్లంఘించడమే. తీవ్ర అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే మానవతా కోణంలో శిక్షను సస్పెండ్ చేసే వీలుంటుంది. సెంగార్ విషయంలో అటువంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 473 ప్రకారం పండుగల సందర్భంగా ఖైదీలను విడుదల చేసే అవకాశమున్నా, అది అత్యాచారం, ఉగ్రవాదం వంటి హీనమైన నేరాలకు వర్తించదు.అయితే అధికార పార్టీ నేతలను కాపాడేందుకు వ్యవస్థలు కృషి చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరి ఉన్నావ్ బాధితురాలికి న్యాయం జరుగుతుందా అన్నది చూడాలి.

మౌనిక, హైదరాబాద్