16 July, 2026 | 11:33 AM

అజయ్ అచ్చుగుద్దాడు

18-04-2024 01:20 AM

తాజాగా మన హైదరాబాదీ జీవితచరిత్రపై బాలీవుడ్‌లో ‘మైదాన్’ సినిమా విడుదలవడంతో.. గూగుల్‌లో రహీమ్ సాబ్ గురించి వెతుకులాట పెరిగింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గన్.. రహీం సాబ్ పాత్ర పోషించాడు. క్రీడాభిమానులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. క్రిటిక్స్ సైతం రహీం సాబ్ జీవితంలోని సంఘర్షణను ఆస్వాదిస్తున్నారు. గతంలో క్రీడాస్ఫూర్తి పేరు చెబితే.. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘చక్ దే ఇండియా’ సినిమా గుర్తుకు వచ్చేది. ఆ సినిమాలో కోచ్ పాత్ర పోషించిన షారుక్ ఖాన్ చివర్లో ప్లేయర్లలో స్ఫూర్తి రగిల్చేందుకు అద్భుతమైన స్పీచ్ ఇస్తే.. నిజ జీవితంలో రహీమ్ సాబ్‌కు అది నిత్యకృత్యమని ఈ సినిమా రుజువుచేసింది. క్రమశిక్షణకు మారుపేరైన రహీమ్ సాబ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన అజయ్ దేవ్‌గన్‌పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక రియల్ లైఫ్ హీరో కథను సినిమా మాధ్యమం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన చిత్ర బృందానికి క్రీడాభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.