31 August, 2026 | 1:25 PM

బోధన్ బస్సు కోసం విద్యార్థుల ధర్నా

31-08-2026 11:35 AM

మధ్యాహ్నం వేళ ఆర్టీసీ బస్సు నడపాలని డిమాండ్

బోధన్, ఆగస్టు 31(విజయ క్రాంతి): బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి మధ్యాహ్నం వేళ ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. కల్దుర్కి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును అడ్డుకుని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కల్దుర్కి గ్రామం నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు బోధన్ పట్టణంలోని వివిధ కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్నారు. అయితే ఉదయం వేళ బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం కళాశాలల నుంచి తిరిగి గ్రామానికి చేరుకునేందుకు సరైన ఆర్టీసీ బస్సు సర్వీసు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఇప్పటికే పలుమార్లు బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో బస్సు ముందు ధర్నాకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం వేళ కల్దుర్కి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల రాకపోకలకు అనుగుణంగా బస్సు సమయాలను నిర్ణయించి, ప్రతిరోజూ సర్వీసు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్టీసీ అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.