ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాపాలన- ప్రణాళిక’
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు
రంగారెడ్డి, మార్చి 6 ( విజయక్రాంతి): ప్రజల సమస్యలను వారి ముంగిటనే పరిష్కరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ,ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు.అన్ని శాఖల అధికారులు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
బాధ్యత: ప్రజా ప్రతినిధులు, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని,ఈ ప్రగతి ప్రణాళిక క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే అధికారుల కృషి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
99 రోజుల ప్రత్యేక కార్యాచరణ..
జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ 99 రోజుల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి, వారికి తక్షణమే వారికి పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు.పెండింగ్లో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు. శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 10 ప్రధాన అంశాలపై ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నేరుగా గ్రామాలకే వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
జిల్లా యంత్రాంగం సంసిద్ధత..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని 8 నియోజకవర్గాలకు ఇప్పటికే నోడల్ అధికారులను నియమించామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన 6 హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం అని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చూస్తామని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. కలెక్టర్లు మను చౌదరి, దీపక్ తివారి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, వీర్లపల్లి శంకరయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




