అన్ని జెనరేషన్స్ ఆయన నుంచి నేర్చుకోవచ్చు
ప్రముఖ బాలీవుడ్ నటుడు, చిత్ర నిర్మాత రాజ్ కపూర్ 100వ జయంతి సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్, నటుడు రాజ్ కపూర్ 1988లోతన 63 ఏట కన్నుమూశారు. ఎక్స్ వేదికగా కపూర్‌ను ప్రధానమంత్రి నివాళులర్పిస్తూ కళామతల్లికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. “విజనరీ చిత్ర నిర్మాత, నటుడు, అద్భుతమైన కళాకారుడు. ఆయన చిత్రనిర్మాతలు, నటులకు స్ఫూర్తి.
ఈ రోజు మనం రాజ్‌కపూర్ 100వ జయంతిని జరుపుకుంటున్నాం. కపూర్ భారతీయ, ప్రపంచ చలన చిత్రాలపై చెరగని ముద్ర వేశారు” అని మోదీ కొనియాడారు. సినిమా పట్ల కపూర్‌కి ఉన్న అభిరుచి, తనను తాను ‘పయోనీరింగ్ స్టోరీటెల్లర్’గా మార్చు కునేందుకు ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలను కూడా మోదీ ప్రశంసించారు. “కపూర్ సినిమాలు, కళాత్మకత, భావోద్వేగం, సామాజిక వ్యాఖ్యానం కలగలిసి, సాధారణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తాయి.
రాజ్ కపూర్ చిత్రాలలోని కీలక పాత్రలు, మరపురాని మెలోడీలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన చిత్రాల్లో సంగీతం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన కల్చరల్ అంబాసిడర్. అన్ని జెనరేషన్స్‌కు చెందిన చిత్ర నిర్మాతలు, నటులు ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను ఆయనకు మరోసారి నివాళులు అర్పిస్తూ సృజనాత్మక ప్రపంచానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నా” అని మోదీ తెలిపారు. కపూర్ కుటుంబమంతా కలిసి వెళ్లి రాజ్ కపూ ర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మోదీని ఆహ్వానించింది.






