20 April, 2026 | 1:38 AM

హిందువులంతా సంఘటితం కావాలి

20-04-2026 12:00 AM

పాపన్నపేటలో హిందూ సమ్మేళనం

పాపన్నపేట, ఏప్రిల్19: హిందువులు సంఘటితమై హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని బ్యాతోల్ తిమ్మాయపల్లి గీత ఆశ్రమం శాంతానంద స్వామీజీ, ఆర్‌ఎస్‌ఎస్ మెదక్ జిల్లా కార్యవాహ ఓంకార్, మహిళ ఉపన్యాసకురాలు గంగాభవాని పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన  పాపన్నపేటలోని హై స్కూల్ మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సమ్మేళనానికి మండల పరిధిలోని పలు గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ బహిరంగ సభ వేదికపై వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమావేశానికి ముందు భూమాత, గోమాత, గంగా మాత, తులసిమాత, గీతామాత పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా యువతలో దేశభక్తి  పెంపొందించడమే లక్ష్యమన్నారు. ధర్మం, సంస్కృతి, సమాజ నిర్మాణం వంటి అంశాలపై ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కార్య నిర్వహణ అధ్యక్షులు దుర్గేష్, విభాగ్ కార్యవాహ నాగ భూషణం, సంఘం నాయకులు తోట రవి, సాలె దుర్గేష్, మనోజ్, వివిధ గ్రామాల సర్పంచులు, పలు పార్టీల నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.