20 April, 2026 | 1:41 AM

హుస్నాబాద్‌లో చివరిదశకు ‘పదవుల పందేరం’

20-04-2026 12:00 AM

మంత్రి ‘పొన్నం నిర్ణయమే’ ఇప్పుడు రాజకీయ భవితవ్యానికి (కీ)!

హుస్నాబాద్, ఏప్రిల్ 19: హుస్నాబాద్ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల హడావిడి ఊపందుకుంది. అధికార పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు, కష్టకాలంలోనూ జెండా వదలని సీనియర్లుఇప్పుడు తమ సేవలకు గుర్తింపు దక్కే సమయం వచ్చిందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పేరు కేంద్ర బిందువుగా మారింది. ఆయన నిర్ణయమే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో భవిష్యత్ సమీకరణాలను నిర్ణయిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం వరకు హుస్నాబాద్ ప్రాంతం ఎప్పుడూ రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అధికారంలో లేని సమయంలో కూడా పార్టీని వీడకుండా కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులు ఇక్కడ కొదవలేదు.

కష్టసమయంలోనూ, ప్రతికూల వాతావరణంలోనూ పార్టీకి అండగా నిలిచిన వారు ఇప్పుడు తమ రాజకీయ జీవితానికి మలుపుతిప్పే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీలు, కమిటీలు వంటి అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన నేపథ్యంలో హుస్నాబాద్కు కూడా ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒక కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు సిద్ధిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి హుస్నాబాద్ నాయకత్వానికి దక్కవచ్చన్న ప్రచారం స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రచారం మొదలైన నాటి నుంచి హుస్నాబాద్ కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఎవరికి పదవి దక్కుతుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? ఉద్యమకారులను గౌరవిస్తారా? లేక యువ నాయకత్వానికి అవకాశం కల్పిస్తారా? అనే ప్రశ్నలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేసిన అనేక మంది నేతలు తమకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. హుస్నాబాద్లో రాజకీయంగా రెండో, మూడో శ్రేణి నాయకత్వం బలంగా ఉంది. మండలాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, కార్యకర్తల మద్దతు పరంగా బలమైన నేతలు పలువురు ఉన్నారు. అందువల్ల ఒకే పదవికి పలువురు ఆశావహులు ఉండటం సహజం. ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్గా మారే అవకాశం ఉంది.

ఎందుకంటే ఎవరికి అవకాశం ఇచ్చినా, మిగతావారిలో అసంతృప్తి తలెత్తే అవకాశముంది. అయితే స్థానిక నాయకత్వం మాత్రం పొన్నం ప్రభాక్ప పూర్తి విశ్వాసంతో ఉంది. ఉద్యమ నాయకుడిగా, అనుభవజ్ఞుడైన రాజకీయ నేతగా ఆయన సేవలను గుర్తించి సరైన వారికి పదవులు కేటాయిస్తారనే నమ్మకం కార్యకర్తల్లో కనిపిస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించినవారిని విస్మరించకుండా గౌరవిస్తారని ఆశిస్తున్నారు. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు జరుగుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

నామినేటెడ్ పదవుల ద్వారా అసంతృప్తి నేతలను సంతృప్తిపరచడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి వ్యూహాలు కాంగ్రెస్ అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హుస్నాబాద్లో ఇప్పటికే పలువురు నేతలు మౌనంగా లాబీయింగ్ ప్రారంభించినట్లు సమాచారం. తమ సేవల జాబితాలు సిద్ధం చేసుకోవడం, సీనియర్ నేతల మద్దతు కూడగట్టడం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు కనిపిస్తున్నాయి. దీంతో నామినేటెడ్ పదవుల ప్రకటనకు ముందే రాజకీయ ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం హుస్నాబాద్ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల దృష్టంతా ఒకే విషయంపై ఉందిమంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరికి కార్పొరేషన్ పదవి? ఎవరికి సుడా చైర్మన్ ఛాన్స్? ఎవరికి కొత్త అవకాశాల ద్వారం తెరుచుకుంటుంది?మొత్తానికి హుస్నాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు పదవుల పందెం పీక్స్లో ఉంది. అధికార పార్టీలో పనిచేసిన వారికి గౌరవం దక్కే సమయం ఆసన్నమైందని భావిస్తున్న నేతలు ఆశతో ఎదురుచూస్తుండగా, తుది నిర్ణయం మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయం హుస్నాబాద్ రాజకీయ భవిష్యత్ను ప్రభావితం చేసే అవకాశముందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.