17 July, 2026 | 12:48 AM

దూరదృష్టి లేకనే అంధకారం

17-07-2026 12:48 AM
  1. బొగ్గు నిల్వలపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు
  2. ధ్యాసంతా కమీషన్లపైనే   
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమేనని కారణమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అప్రకటిత కరెంట్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని, 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల ఎదుట  ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయని, బీఆర్‌ఎస్ నిద్ర లేపినా ప్రభుత్వం మేల్కొనలేదని విమర్శించారు. 

కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 67 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని వెల్లడించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కేవలం 3,190 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరిగిందన్నా రు. బొగ్గు సరఫరా, నీటి నిల్వలు, విద్యుత్ కేంద్రాల నిర్వహణలో వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బొగ్గు, పవర్, సాండ్, ల్యాండ్ స్కాంలతో కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు. అడ్డగోలు ధరకు 80 మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను పవర్ మార్పిడి ద్వారా కొనుగోలు చేస్తున్నారని, ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు.  

ఇతర రాష్ట్రాలకు క్వాలిటీ బొగ్గు, తెలంగాణకు నాసిరకం   

రోజువారీ బొగ్గు ఉత్పత్తి, నాణ్యతకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా సింగరేణి వెబ్‌సైట్‌ను మూసివేశారని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలో నాణ్యమైన బొగ్గును పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తూ, ఇక్కడి ప్లాంట్లకు నాసిరకం బొగ్గు ఇస్తున్నారని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని మండిపడ్డారు. లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయని, త్రీ ఫేజ్ కరెంట్ కోసం రైతులు రాత్రంతా పొలాల వద్ద జాగారం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోతే బీఆర్‌ఎస్ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు ప్రారంభించిన సీతారామ ఎత్తిపోతల పథకం మో టార్లు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవేనన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,0 59 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 351 టీఎంసీలు(33.17 శాతం) మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి నీళ్ల మీద, పవర్ పైన ధ్యాసే లేదని, వారి ధ్యాసంతా కమీషన్లు, కొట్లాటల మీదనే ఉందని విమర్శించారు.