డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కొడుకు?
- పురానాపూల్ వద్ద మంగళ్‌హట్ పోలీసుల నిఘా
- హాష్ ఆయిల్ కొంటూ చిక్కిన ముగ్గురు యువకులు
- అందులో ఎమ్మెల్సీ కుమారుడు!
- కేసు నుంచి తప్పించేందుకు రంగంలోకి మంత్రి?
- సీపీకి ఫోన్ చేసి ఒత్తిడి!
- కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు
- నా కొడుకుకు సంబంధం లేదు: ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి
రంగారెడ్డి, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్ పురానపూల్ వద్ద గురువారం హాష్ ఆయిల్ కొంటున్న ముగ్గురు యువకులను మంగళ్‌హట్ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఓ ఎమ్మెల్సీ కుమారుడు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. అతడ్ని కేసు నుంచి తప్పించేందుకు స్వయంగా ఓ మంత్రి రంగంలోకి దిగి.. సీపీకి ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే దీనిపై ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి స్పందించారు.
తన కుమారుడికి ఈ కేసుకు సంబంధంలేదని కొట్టి పారేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ ప్రాంతంలో డ్రగ్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఏడుగురు యువకులు అక్కడికి చేరుకోగా, పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో భరత్ రాజ్‌రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
నిందితుల నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ముగ్గురిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రికి అత్యంత దగ్గరి బంధువు, అలాగే ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మె ల్సీ కుమారుడిగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సదరు యువకుడిని కేసు నుంచి గట్టెక్కించేందుకు సదరు మంత్రి స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు మంత్రి ఏకంగా నగర పోలీస్ కమిషనర్ (సీపీ)కే ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే పోలీసులు ఈ కేసు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. పరారైన నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి
హైదరాబాద్‌లో యువత, ముఖ్యంగా ప్రముఖుల పిల్లలు హాష్ ఆయిల్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడుతుండ టం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు డ్రగ్స్ నెట్వర్క్‌ను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మంగళహాట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలేదు: ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి
తన కుమారుడు భరత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఖండించారు. ‘గురువారం ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు తమ ఇంటికి వచ్చి డ్రగ్స్ కేసు విషయమై విచారిస్తున్నామని, సహకరించాలని కోరారు. కొందరు కామన్ ఫ్రెండ్స్ ఫోన్ కాల్ డేటా జాబితాలోని నంబర్ల ఆధారంగా వారు విచారణ నిమిత్తం వచ్చారు. విచారణ లో నా కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. తను అరెస్టూ కాలేదు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు’ అని -ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.






