డంపింగ్ యార్డ్ సమస్యపై ముఖ్యమంత్రిని కలిసిన అఖిల పక్షం
- పరిష్కారానికి సీఎం హామీ
- జేఏసీ నాయకుల దీక్ష విరమణ
మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కా రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం అఖిలపక్ష నాయకులు సీఎంను కలిసి సమస్యను వివరిం చగా, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి చెందిన చెత్తను మొత్తం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు వాయు కాలు ష్యం, రోగాల బారిన పడటం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు.
ఈ విషయ మై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకపోవడంతో డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. పది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మె ల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, చేసిన నాయకులు సీఎంను కలిసి విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ నెల 15 లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
15వ తేదీ తర్వాత అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి జవహర్ నగర్ డంపింగ్ యా ర్డ్ సమస్య ఎలా పరిష్కరించాలో, నూతన డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు పై అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. విదేశాలలో చెత్త సేకరణకు అవలంబిస్తున్న శాస్త్రీయ విధానాలను అధ్యయనం చేసేందుకు అవసరమైతే అధికారులతో పాటు అఖిలపక్ష నాయకులు కూడా పంపుతామన్నారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నారాయణ, పద్మాచారి, ఏనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, స్వర్ణ శ్రీనివాస్ ఉన్నారు.
నిరాహార దీక్ష విరమణ..
డంపింగ్ యార్డ్ తరలించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం విరమించారు. సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడంతో డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ నిమ్మరసం ఇచ్చే దీక్ష విరమింపజేశారు. సీఎం సానుకూలంగా స్పందించడం పట్ల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






