15 April, 2026 | 5:05 PM

సరస్వతి పుష్కరాల పనులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలి

14-04-2026 12:06 AM

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 13 (విజయక్రాంతి): సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. సోమవారం సచివాలయం నుండి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి ఆర్కిటెక్చర్ సూర్యనారాయణతో కలిసి మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాల  పనుల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఐడిఓసి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..కాళేశ్వరంలో  మే నెలలో సరస్వతి అంత్య పుష్కరాలు మొదలవబోతున్నాయని,  పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  పనులు పూర్తి చేయాలని తెలిపారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం చేపట్టిన శాశ్వత, తాత్కాలిక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సరస్వతి ఆది పుష్కరాల సందర్భంగా  మొదలు పెట్టిన పెండింగ్ పనుల పురోగతిపై ఆరా తీశారు. తాత్కాలిక  ప్రాతిపదికన చేపట్టబోయే పనులు 15 రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు.

.ఇంకా టెండర్లు పూర్తి కాని పనులకు టెండర్లు పిలవాలని టెండర్లు పూర్తి అయిన పనులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు..ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మితో పాటు అన్ని ఇంజినీరింగ్  శాఖల అధికారులు పాల్గొన్నారు.