ప్రమాద రహిత జిల్లాగా మానుకోట ఆవిర్భవించాలి
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వాహనదారులు రోడ్డు ప్రమాద నివారణ చర్యలను పాటిస్తూ, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గమ్యం చేరుకుంటూ, మానుకోట జిల్లాలో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 13 ఏప్రిల్ నుండి 18 ఏప్రిల్ వరకు ఆరు రోజుల పాటు అరెవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాల నిర్వహణ పోస్టర్, గోడపత్రిక సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అన్ని విభాగాల సిబ్బంది, టూ వీలర్ యజమానులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపరాదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, అతివేగంగా వాహనాలు నడపరాదనీ,
ఓవర్టేక్ చేయరాదని, బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ జిబ్రా క్రాసింగ్ పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే తమకే మంచిదని ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్ పాల్గొన్నారు.




