సాంకేతిక సమస్యలే
ఆధార్, రేషన్, అకౌంట్లలో పేర్ల తప్పులు
- 8లక్షల మందికి పరిమితికి మించి రుణాలు
- మండల్లాలో ఫిర్యాదు కేంద్రాలతో పరిష్కారం
- వీరందరికీ త్వరలోనే రుణమాఫీ చేస్తాం
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడి
- ఈ సీజన్ నుంచే వరికి బోనస్: జూపల్లి
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేదని, ఇంత వేగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర తమదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్లనే కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని, వాటిని పరిష్కరించి ఆ రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామని తెలిపారు. ‘1.20 లక్షల మంది రైతుల ఆధార్ నంబర్లలో, 4.83 లక్షల మంది రేషన్ కార్డుల్లో తప్పలున్నాయి. 1.61 లక్షల రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఆధార్‌లోని పేరుతో పాస్‌బుక్‌లోని పేరు మిస్ మ్యాచ్ అవుతు న్నది. 1.50 లక్షల అకౌంట్లలో బ్యాంకు తప్పిదాలున్నాయి.
8 లక్షల అకౌంట్లకు రెండు లక్షల కంటే రుణాలు ఎక్కువ ఉన్నాయి. వీరందరికీ త్వరలోనే రుణమాఫీ చేస్తాం’ అని వివరించారు. ప్రతి పక్షాలు దురుద్దేశంతోనే రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయని మండి పడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఏనాడూ సహాయం చేయలేదని ఆరోపించారు. రుణమాఫీ చేతగాని గత ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించిన బీఆర్‌ఎస్.. మొదటి, రెండో దశలో చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని విమర్శించారు. రుణమాఫీ అర్హత ఉండి సాంకేతిక కారణాలతో ఆగినవారికి అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు సెంటర్లను ఏర్పాటుచేసి ఫిర్యాదులు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఏ సమస్యలున్నా వివరాలు తీసుకొని పరిష్కరించి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 2014 2018 రుణమాఫీ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు కేంద్రాలనే ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రూ.౨ లక్షలకు పైగా రుణాలున్న ఖాతాల రైతులు.. పైన ఉన్న రుణాలు మొత్తం చెల్లించిననాడే వారి రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు.
ప్రస్తు సీజన్ నుంచే వరికి రూ.500 బోనస్: మంత్రి జూపల్లి కృష్ణారావు
ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత ప్రభుత్వం దాదాపు రూ.8 లక్షల కోట్లు అప్పు చేసినా తమ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం రుణమాఫీలో చాలా తప్పులు చేసిందని ఆరోపించారు. బావా బామ్మర్థులు సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్, హరీష్‌రావును ఉద్దేశించి విమర్శించారు. బీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చామని తెలిపారు.
రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నారు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రైతు రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
విగ్రహం జోలికి వస్తే తాట తీస్తాం: ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్
రాజీవ్‌గాంధీ విగ్రహం జోలికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తాట తీస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రాజీవ్‌గాంధీ పేరు ఉచ్చరించే స్థాయి కేటీఆర్‌కు లేదన అన్నారు. అధికారం పోయినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజీవ్‌గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని అంటావా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేటీఆర్ వ్యాఖ్యలతో మా రక్తం మరుగుతోంది.
దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ గురించి మాట్లాడడానికి కేటీఆర్‌కు నోరెలా వచ్చింది? రాజీవ్‌గాంధీ దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. విగ్రహం రూపకల్పన జరుగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గురించి కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆ పార్టీ గురించి ప్రజలు మాట్లాడుకోవడమే మానేశారు’ అని ఎద్దేవా చేశారు.






