25 May, 2026 | 7:23 PM

యంగ్ ఇండియా బ్రాండ్‌గా తెలంగాణ

20-08-2024 06:11 AM
  1. క్రీడలకు కేంద్ర బిందువు 
  2. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలే లక్ష్యం 
  3. ప్రతి క్రీడకు ప్రాధాన్యం దక్కాలి 
  4. స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకే అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు 
  5. ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఆయన చర్చించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏవిధంగా ఉండాలనే దానిపై పలు సూచనలు చేశారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని, అన్ని రకాల క్రీడలను, క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమన్నారు. మన దేశంతోపాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, మన శారీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలు ఏవో గుర్తించి, క్రీడలపై ఉత్సాహం ఉన్న వారిని గుర్తించి వారిని ఆయా క్రీడల్లో ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

దశాబ్దాల క్రితమే ఆఫ్రో గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌ను భవిష్యత్‌లో ఒలింపిక్స్‌కు వేదికగా నిర్వహించడమే కాకుండా ప్రతి క్రీడలో మన క్రీడాకారులు పతకాలు దక్కించుకునేలా వారిని తీర్చిదిద్దాలని, అందులో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు కచ్చితంగా ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం వారికి నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించాలన్నారు. 

ప్రతి లోక్‌సభ స్థానంలో..

చిన్నతనంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలు, వారికి ఏ క్రీడలపై మక్కువ ఉందో ఉపాధ్యాయులు గుర్తించాలని సీఎం సూచించారు. అటువంటి విద్యార్థులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్  ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలల్లో విద్యా బోధనతో ఉంటుందని అయితే క్రీడలకు  ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, విద్యార్థులకు అక్కడ వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ ఇచ్చి, ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించి మరింత పదును తేలేలా శిక్షణ ఇప్పించాలన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో..

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, క్రీడా శిక్షణ సంస్థలు అన్నింటిని స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలో తీసుకురావాలని అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన దేశ క్రీడాకారులు ఒలంపిక్స్‌లో రాణించే షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత శిక్షణ ద్వారా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. యూనివర్సిటీలో ఆయా క్రీడల్లో శిక్షణకు అవసరమైన వసతులు, ఆహారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. 

సమగ్ర అధ్యయనం..

హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి  కేంద్ర బిందువుగా ఉండాలని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి, ఆయా క్రీడాకారులు పతకాల సాధనకు శ్రమించిన తీరు, ఆయా దేశాలు వారిని ప్రోత్సహించిన తీరు, వారికి ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం తదితరాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు యంగ్ ఇండియా పేరు పెడతామని సీఎం వెల్లడించారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాలని సీఎం ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తిమంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.