టెకీలు సతమతం
సమన్వయ లోపంతో వృత్తి, కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులు అధిక పనిగంటలతో ఆరోగ్యంపై అశ్రద్ధ ఉద్యోగాల తొలగింపుతో తీవ్ర ఒత్తిడి
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఆకాశ హర్మ్యాలు.. అద్దాల మేడలు.. ఇది బయట నుంచి చూసే వారందరికీ అద్భుతంగా కనిపించే ఐటీ రంగం. చాలా మంది యువతకు పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించాలి.. జీవితంలో బాగా సెటిల్ అయ్యి, కుటుంబంతో ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆశ ఉంటుంది. నాన్ ఐటీ ఉద్యోగులు ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఏం సమస్యలు ఉంటాయి.. ఐటీ రంగంలో స్థిర పడితే జీవితమంతా సజావుగా సాగిపోతుందనే భావన ఉంటుంది.
కానీ ‘ఎంత చెట్టుకు అంతే గాలి’ అన్నట్టుగా ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసే వారికీ కష్టాలు, నష్టాలు, సమస్యలుంటాయి. ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి వృత్తిని, కుటుంబాన్ని సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు టెకీల లైఫ్ స్టుల్‌తో పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు ఎలాగూ ఉన్నాయి.
ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సరిగా బ్యాలెన్స్ చేసుకోలేక ఎంతో మంది ఐటీ ఉద్యోగులు సతమతవుతున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఆరోగ్య సమస్యలతోపాటు కుటుంబ పరంగా, ఆర్థికంగా, పిల్లలు, అధిక గంటల పని కారణంగా చాలా ఒత్తిడికి గురవుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు..
ఉద్యోగుల ఒత్తిడి, ఆందోళనల వంటి చాలా సమస్యలకు ప్రధాన కారణం డబ్బులే. ఐటీ రంగంలో ఉద్యోగులు భారీస్థాయిలో జీతాలు అందుకుంటున్నా.. వారి జీవితశైలికి తగినట్టు ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. మంచి ప్యాకేజీ జీతం వస్తుండటంతో చాలా మంది టెకీలు లోన్ తీసుకుని మరీ సొంత ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రతినెలా ఈఎమ్మెఐ రూపంలో చెల్లింపులుంటాయి. దీనికి తోడు క్రెడిట్ కార్డుల బిల్లులు, షాపింగ్‌లు, రవాణా ఖర్చులు, వీకెండ్ పార్టీలు, రోజువారీ ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాదకబాదకాలెన్నో ఉంటాయి. ఐటీ రంగంలోని వర్కింగ్ కల్చర్‌లో భాగంగా టెకీలు తెలియకుండానే లగ్జరీ జీవితానికి అలవాటు పడుతున్నారు. సాధారణంగా టెకీల జీతాలు వివిధ స్థాయిల్లో సగటున రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉన్నాయి. అసాధాణమైన జీవనశైలితో అనేక ఆర్థిక ఇబ్బందుల బారిన పడుతున్నారు.
కుటుంబ సమస్యలు...
ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 75 శాతం వరకు కుటుంబానికి తగిన సమయం కేటాయించడం లేదని పలు సర్వేల్లో తేలింది. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కుటుంబపరమైన బంధాలకు దూరమవుతున్నారు. వృత్తి పరమైన పనులు సాఫీగా సాగిపోవడంలో కు టుంబ పాత్ర కీలకంగా ఉంటుంది. ఆఫీసు లో ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేయా లం టే ఇంట్లో ఎలాంటి సమస్యలూ ఉండకూడదు. ఐటీ రంగంలో ఉద్యోగం కారణం గా ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉం డటమూ సమస్యలకు కారణమవుతుంది.
దీంతోపాటు ఆర్థిక సమన్వయ లోపం కూడా కుటుంబ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయం లో ఈ సమస్య తలెత్తుతుంది. ఇద్దరూ ఐటీ రంగంలోనే ఉద్యోగం చేస్తే వేర్వేరు సమయాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. అలాంటప్పుడు ఒకరికొకరు సమ యం కేటాయించుకోవడం శ్రద్ధ లేకపోవడంతో వైవాహిక జీవితంలోనూ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటున్నాయి.
పిల్లల ఆలన పాలన...
సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ టెకీల ఉద్యోగ సమయాలు అనుకూలంగా లేకపోవడంతో కొంత మంది వారి పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ పిల్లల ఎదుగుదలపై తల్లిదం డ్రుల పర్యవేక్షణ ఉండటం ఎంతో అవసరం. పిల్లలకు కావాల్సిన సమయంలో పేరెంట్స్ అందుబాటులో లేకపోతే వారు ఒంటరిగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలపై పర్యవేక్షణ లోపిస్తే వారు చెడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదముంది. పిల్లలకు సరైన సమయం కేటాయించకపోవడం కూడా టెకీల ఒత్తిడికి కారణమవుతుంది.
మహిళలకు మరీ ఇబ్బందులు...
ఐటీ ఉద్యోగాల్లో మహిళల శాతం కూడా అధికంగానే ఉంది. వారు కూడా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందుతున్నారు. తమ కుటుంబాలకు బాసటగా నిలవడం కోసం ఉద్యోగం చేసే మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మహిళా ఉద్యోగుల్లో వివాహితలుంటే వృత్తి, కుటుంబ నిర్వహణ మరింత కష్టతరమవుతున్నది. ఉద్యోగంతోపాటు పిల్లల సంరక్షణ వంటి అదనపు బాధ్యత కూడా వారికి ఉంటుంది. అందులోనూ సింగిల్ మదర్ అయి ఉంటే తమ పిల్లల చూసుకోవడానికి మరొకరిపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో పిల్లల తగిన సమయం కేటాయించలేరు. పర్యవేక్షణ లోపించడంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నది.
అధిక గంటల పని...
ఐటీ రంగంలో ఉద్యోగులు వారానికి సగటున 52.50 గంటలు పనిచేస్తున్నారు. అంటే రోజుకు 10 గంటలపైనే పని వేళలుంటున్నాయి. పనివేళలు కూడా సిఫ్టుల వారీగా ఉండటంతో జీవనశైలిలోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది టెకీలు నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. పని షెడ్యూల్ సరిగా లేని కారణంగా 26 శాతం మంది టెకీలు నిద్రలేమి సమస్యకు గురవుతున్నట్టు ఇటీవల ఒక సర్వే స్పష్టం చేసింది. 51 శాతం మంది ఐటీ ఉద్యోగులు రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. అధిక పని, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఒత్తిడికి ప్రధాన కారణాలు మారుతున్నాయి.
ఆరోగ్య సమస్యలు...
ఐటీ ఉద్యోగుల వృత్తి పరమైన సమస్యలను పక్కపెడితే.. వారు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. దేశవ్యాప్తంగా 56 వేల మంది ఐటీ ఉద్యోగుల ఆరో గ్య స్థితిగతులపై హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ సంస్థ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. వీరిలో 77 శాతం మంది ఆరోగ్యం చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్టు తేలింది. 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొంది. క్లినికల్ స్టడీ చేసిన తర్వాత హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని 25 నుంచి 40 ఏళ్లలోపు వారిపై చేసింది. దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల్లో అనారో గ్య పరిస్థి తులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
40 ఏళ్లు దాటిన వారిలో ప్రమాదకరంగా..
ప్రధానంగా 40 ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకర స్థితిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నాయి. వీరిలో కేవలం 23 శాతం మంది ఉద్యోగుల హెల్త్ పారామీటర్స్ తగిన స్థాయిలో ఉన్నాయి. ఇక పరీక్షలు చేయించుకున్న వారిలోఓ 37 శాతం మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26 శాతం మందిలో రెండు, 11 శాతం మందిలో 3 రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్టు తెలిపింది. సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ వ్యాధులన్నీ 40 ఏళ్ల తర్వాత బయటపడుతుంటాయి. కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రం ఇవి 30 ఏళ్లలోపే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారి జీవనశైలి అని స్పష్టమైంది.
అలవాట్లతోనే అనారోగ్యం...
ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 నుంచి 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ ఉద్యోగులైతే తప్ప కుండా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్, రెడీమేడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే గంట కొద్దీ ఒకేచోట కదలకుండా కూర్చుంటున్నారు. ఇలాంటి లైఫ్‌స్లుల్ వల్ల వారి లో రకరకాల ఆనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగు లు ఎక్కువగా యాంత్రిక జీవన శైలిని గడుపుతున్నారు. అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. డే అండ్ నైట్ పని, వ్యాయామం లేకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం, స్మోకింగ్, మద్యపానం, సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
తొలగింపుతో మరిన్ని సమస్యలు...
కరోనా ప్రభావం తర్వాత ఐటీ రంగంలో భారీ సంక్షోభంతో టెకీలకు సమస్యలు మొదలయ్యాయి. ప్రపంచ స్థాయి కంపెనీల్లో సైతం ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుండటం టెకీలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే చాలా కంపెనీల్లో భారీగా లేఆఫ్స్ జరగాయి. ఇంకా లేఆఫ్స్ కొనసాగుతున్నా యి. దీంతో జీతాలపై ఆధారపడే టెకీల జీవితాల్లో ఒడిదుడుకులు తలెత్తుతున్నాయి. లేఆఫ్స్ సమస్య కారణంగా కొత్తగా జాబ్‌లో చేరిన వారే కాదు.. సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ టెకీలు జీతాలకు తగ్గట్టు అప్పటికే వారు చాలా బాధ్యతల్లో చిక్కుకుపోయి ఉండటంతో వాటి నుంచి బయట పడటం ఎంతో కష్టతరమవుతుంది.
ఉద్యోగాల్లో కొనసాగుతున్నప్పుడే ఐటీ ఉద్యోగు లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటిది ఉద్యోగాల తొలగిం పులతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆర్థికంగా దెబ్బతింటున్నారు. అయితే ఉద్యోగాల తొలగింపునకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపు ణ్యం పెంపొందించుకోకపోవడమూ ఒక కారణంగా చెప్పొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యాన్ని పెం పొందిం చుకుంటే ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ ఉపాధి కోల్పోయే ప్రమాదం నుంచి సులువుగా బయటపడే అవకాశం ఉంటుంది.
ప్రధానమైన ఆరోగ్య సమస్యలివే...
ప్రీడయాబెటిస్, డయాబెటిస్, ప్రీ హైపర్ టెన్షన్, రక్తపోటు, రక్తహీనత, హైపోథైరాయిడిజమ్, అధిక కొవ్వులాంటి ఆరోగ్య సమస్యలు ఐటీ ఉద్యోగులను ఎక్కువగా ఇబ్బందికి గురుచేస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రీ డయాబెటిస్, 11 శాతం మంది రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ఉద్యోగుల్లో ప్రతిఒక్కరూ ఒక్కటికంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 25 ఏళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీరిలో 14 శాతం మంది రక్తహీనతోఓ, 13 శాతం మంది ఊబకాయంతో, 8 శాతం మంది హైపోథైరాయిడిజంతో, 7 శాతం ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వయసు పెరిగే కొద్ది ఈ రకమైన ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే ప్రమాదముంది.
ఐసీఎంఆర్ సూచనలు..
- ఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్ డెస్క్ ఉపయోగించాలి. ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి.
- ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి.
- ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేటప్పుడు నడు స్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి.
- రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారం లో ఐదు రోజులు వ్యాయా మం తప్పనిసరి
- రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.








