మాజీ డీసీసీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాదరావుపై ఆరోపణలు సరికాదు
ఆధారాలు ఉంటే బయటపెట్టాలి
మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మాజీ డీసీసీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాదరావుపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ఆరోపణలు నిరాధారమని ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, కొండు భారతి, హనుమండ్లు స్వప్నరాణి, కనక కృష్ణమ్మ, పుష్పలత, లోనారె తారాబాయిలు కలిసి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే కె. విశ్వప్రసాదరావు ఎన్నికల సామగ్రి, ప్రచార రథాలు తదితర ఏర్పాట్లు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో కీలకంగా పనిచేశారని వారు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన ఆయనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇండిపెండెంట్‌గా గెలిచిన నలుగురు కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలపడంలో విశ్వప్రసాదరావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ కాకూడదనే ఉద్దేశం ఆయనకు ఉంటే, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతును కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నిస్తారని ప్రశ్నించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ గదవేని మల్లేష్‌కు 2, 6, 19వ వార్డుల ఎన్నికల బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి లేకపోవడంపై పార్టీ నాయకత్వం వాస్తవాలను పరిశీలించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేశారంటూ చేసిన ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
నిజంగా అంత మొత్తం ఖర్చు జరిగి ఉంటే ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా చెల్లింపులు జరిగాయో స్పష్టంగా వెల్లడించాలని అన్నారు.చైర్మన్ ఎన్నికల సమయంలో ఎవరు ఎవరితో సంప్రదింపులు జరిపారు, ఎవరు పార్టీకి అనుకూలంగా, ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించారనే విషయాలు చట్టపరమైన నిబంధనలకు లోబడి పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.ఇకనైనా ఒకరిపై ఒకరు నిరాధార ఆరోపణలు చేసుకోవడం మానుకుని, ఆధారాలతో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కౌన్సిలర్లు కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.






