చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించాలి
తిమ్మాజీపేట,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిమ్మాజీపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చిన్నారుల ఎత్తు, బరువును పరిశీలించి, వయస్సుకు తగ్గ ఎదుగుదల లేని పిల్లలను గుర్తించి అదనపు పోషకాహారం, వైద్య సేవలు అందించాలని సూచించారు. బాలామృతం సకాలంలో అర్హులైన పిల్లలందరికీ అందేలా చూడాలని, పంపిణీ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.
గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, చిన్నారుల హాజరు, ప్రాథమిక విద్య, పోషకాహారంపై సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదన్నారు.






