11 August, 2026 | 3:47 PM

Breaking News

ప్రాజెక్టుల గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు

11-08-2026 02:34 PM

హైదరాబాద్: గత రెండేళ్లు సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, పంటలు బాగా పండాయని ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగంలో పాల్గొంటే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు అంటున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక యాగాలు చేశారని, ఆయన చేసిన అయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చారన్నారు. కేసీఆర్ చేసిన యాగాలపై మేమెప్పుడు తప్పుగా మాట్లాడలేదని ఆది శ్రీనివాస్ తెలిపారు. 

ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతుల సంక్షేమం కోసమే వరుణయాగం చేసిందని, ఎల్ నివో ప్రభావం తగ్గి వర్షాలు కురవాలని కోరుతూ యాగం చేశామని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలంటూ హరీష్ రావు అంటున్నారని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నిళ్లు నిలువ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని గుర్తు చేశారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నిలువ చేస్తే మొత్తానికే నష్టమని ఎన్డీఎస్ఏ చెప్పిందని, మేడిగడ్డతో పనిలేకుండానే ఎల్లంపల్లి, ఎల్ఎండీలోకి నీళ్లు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల గురించి హరీష్ రావు మాకు పాఠాలు చెప్పక్కర్లేదంటూ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. హరీష్ రావు చర్యల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని, అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్నాళ్లు కేసీఆర్ పక్కకు పెట్టారని దుయ్యబట్టారు.