18 May, 2026 | 3:59 PM

రామయ్య మున్సిపాలిటీలో భారీ అవినీతి ఆరోపణలు

18-05-2026 02:55 PM

13 సెటైల్ రా అక్రమ అభిప్రాయాలపై బిజెపి ఆగ్రహం..

రామాయంపేట మే 18 (విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీలో భారీ అవినీతి – వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈరోజు రామాయంపేట మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 15వ ఫైనాన్స్ నిధులు, ఎన్నికల నిధుల గోల్మాల్ మరువకముందే మరో కుంభకోణం వెలుగులోకి రావడం బాధాకరమని అన్నారు.

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 2006 సంవత్సరంలో మున్సిపల్ స్థలంలో 13 షట్టర్లను నిర్మించి 20 సంవత్సరాల లీజుకు అప్పగించారని తెలిపారు. 2026తో ఆ లీజు గడువు పూర్తయినప్పటికీ మున్సిపల్ అధికారులు మరియు పాలకవర్గం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని రీ-టెండర్ నిర్వహించాల్సిన బాధ్యతను నిర్వర్తించలేదని విమర్శించారు.

ఇటీవల ఆ 13 షట్టర్లలో రెండు షట్టర్లను ప్రస్తుతం కిరాయికి ఉన్న వ్యక్తులు రూ.54 లక్షలకు అమ్ముకున్నారని, ఇది పూర్తిగా అక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను లీజుదారులు విక్రయిస్తున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం చోద్యం చూస్తూ ఉండడం అత్యంత విచారకరమని అన్నారు.

లీజు గడువు పూర్తయిన వెంటనే ఆ షట్టర్లన్నింటిని మున్సిపాలిటీ హ్యాండోవర్ చేసుకుని, ఓపెన్ టెండర్ల ద్వారా తిరిగి 20 సంవత్సరాల లీజుకు ఇవ్వాల్సి ఉందన్నారు. అలా చేస్తే రామాయంపేట మున్సిపాలిటీకి రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కానీ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా ప్రజా ఆస్తులు కొంతమంది చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అక్రమంగా షట్టర్లు అమ్ముకున్న వారి పేర్లను బయటపెట్టి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి 13 షట్టర్లను మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకుని రీ-టెండర్ ప్రక్రియ చేపట్టాలని, రామాయంపేట ప్రజల ఆస్తిని కాపాడాలని కోరారు. లేదంటే మున్సిపాలిటీని దిగ్భంధం చేసే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, మాజీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్, యువ మోర్చా నాయకులు నాగరాజు, అనిల్, సంతోష్, వెంకటి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.