17 July, 2026 | 3:42 PM

బోధన్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

17-07-2026 03:42 PM

- మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల మంజూరు

- ఆసుపత్రి పరిశుభ్రతపై అసంతృప్తి.. కాంట్రాక్టర్‌కు షోకాజ్ ఆదేశం

- పక్షం రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశం

బోధన్,(విజయక్రాంతి): బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించి ఆసుపత్రి పనితీరు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. అవుట్ పేషంట్ బ్లాక్, ప్రసూతి విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థలో ఉన్న ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతను గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పారిశుధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి గర్భిణీలు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నందున బర్త్ వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో-లీగల్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో భద్రత కోసం ఆసుపత్రిలో పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు శాఖకు ప్రతిపాదిస్తామని చెప్పారు.

ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసిన కలెక్టర్, తాను తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. స్థానిక ఆర్డీఓ నేతృత్వంలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి, ఆసుపత్రి నిర్వహణపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.