జన నాయగన్‌కు జతగా..
2024లో ‘ది గోట్’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో అందరి దృష్టి విజయ్ తర్వాతి సినిమాపై నెలకొంది. అయితే ఆయన నెక్ట్స్ మూవీ గురించి కొద్దిరోజులుగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’కు దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తారని, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోందనేది ఆ వార్తల సారాంశం. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, మమతా బైజు, డీజే, వరలక్ష్మి శరత్‌కుమార్, రెబా మోనికా జాన్ వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే భాగమయ్యారు.
ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులో శ్రుతిహాసన్ భాగస్వామ్యం అయిందనేది సమాచారం. శ్రుతి ఇప్పటికే విజయ్ సరసన ‘పులి’ చిత్రంలో నటించింది. ఇప్పుడు ‘జన నాయగన్’లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సినీ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.
ఇదే నిజమైతే విజయ్ సరసన శ్రుతిహాసన్ నటించిన రెండో చిత్రం ఇదే కానుంది. శ్రుతి హాసన్ చివరగా ‘సలార్’ చిత్రంలో నటించింది. ప్రభాస్ నటించిన ఈ సినిమాతో శ్రుతి.. మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.






