ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్, జూలై 27: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. సోమవారం ధరూరు రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేశారు.
జిల్లాలోని 13 మండలాల రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంది, పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు వంటి పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీలు, పథకాలను వినియోగించుకుని లాభదాయక వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






