28 July, 2026 | 2:18 AM

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ఆరుతడి మేలు

28-07-2026 01:44 AM

నిర్మల్ జులై 27 (విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు పంటమార్పిడి విధానాలను అవలంబించి, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలోని రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి రైతులకు పత్తి, కూరగాయలు తదితర పంటల నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సంరక్షిస్తూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమని, ప్రభుత్వం కూడా ఈ పంట సాగును ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.

జిల్లాలో ప్రస్తుతం 8,751 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, ఈ ఏడాది 1,600 ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే 1,670 ఎకరాలకు సంబంధించిన నాన్-సబ్సిడీ మొత్తాన్ని రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 5,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రమణ, సర్పంచ్ సుప్రియ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులుపాల్గొన్నారు.