28 July, 2026 | 1:50 AM

పీకేఓసీ సింగరేణికే ఇవ్వాలి

28-07-2026 01:13 AM
  1. టెండర్ల నుంచి జెన్‌కో వెనక్కి తగ్గాలి 
  2. కొత్త బ్లాకులు తీసుకోకుండా ఆదాయానికి గండికొట్టిన బీఆర్‌ఎస్
  3. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాపంతో సింగరేణికి రూ. 54 వేల కోట్ల బకాయిలు 
  4. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుకు కాంగ్రెస్ సహకరిస్తలేదు 
  5. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా?
  6. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ సైడ్ ఎక్స్‌టెన్షన్ సింరేణికి రావాలనేదే తమ తాపత్రయమని, ఈ టెండర్ల నుంచి జెన్‌కో వెనక్కు తగ్గి సింగరేణికి ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిలు-2026కు ప్రతిపక్షం సహకరించడం లేదని విమర్శించారు.

దేశం ఏమైనా పర్వాలేదు, మోదీని గద్దె దించి నెహ్రూ కుటుంబాన్ని ఎక్కించాలనే అహంకారం కాంగ్రెస్‌దని మండిపడ్డారు. తన హయాంలో పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిం చారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చుకున్నాయని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ కొత్త బ్లాకులు తీసుకోకుండా.. వచ్చే ఆదాయానికి గండికొ ట్టిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా సింగరేణి పరిస్థితి ఏమా త్రం మెరుగుపడలేదన్నారు. ఈ రెండు పార్టీల పాపం కారణంగా సింగరేణికి రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థకూ ఇంతపెద్ద ఎత్తున బకాయిలు లేవన్నారు. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్‌లో కూరుకుపోయిన సింగరేణికి వాజ్‌పేయి ప్రభుత్వం రూ.684 కోట్ల అప్పుపై మారటోరియం విధించిందని, సింగరేణి అభివృద్ధికి అదనంగా రూ.525 కోట్ల ఆర్థిక సహకారం అందించిందన్నారు.

2014లో కేసీఆర్ మొండి వైఖరితో సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబించి, కేసీఆర్ ప్రభుత్వం నాడు వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ను 2015లో సింగరేణికి విద్యుదుత్పత్తి కోసం మోదీ సర్కారు కేటాయించిందలిచినా కేసీఆర్ ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదని, ఒడిశా ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేదని విమర్శించారు.

ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులు ఇప్పించి 2024లో ప్రొడక్షన్ ప్రారంభించుకున్నామని వెల్లడించారు. దీనిపై మంత్రులు గొడవపడి నైని బ్లాక్ విషయంలో రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే అన్నారు. తాడిచెర్ల -2 బొగ్గు బ్లాక్ కేటాయింపులో ఉన్న న్యాయపరమైన అంశాలను పరిష్కరించి సింగరేణికి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని గుర్తు చేశారు. 

పీకేఓసీ సైడ్ ఎక్స్‌టెన్షన్

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) -డిప్ ఎక్స్‌టెన్షన్‌ను వేలం ప్రక్రియలో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ బ్లాక్ కూడా సింగరేణికే వచ్చేలా టెండర్లు వేయాలని కార్మిక సంఘాలు కూడా కోరాయన్నారు. తెలంగాణ జెన్‌కో సింగరేణికి పోటీగా టెండర్‌లో పాల్గొన్నదన్నారు. తెలంగాణ జెన్‌కోకు గతంలో తాడిచర్ల-1 క్యాప్టివ్ మైన్‌ను కేటాయిస్తే.. దీన్ని సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించిందన్నారు.

పీకేవోసీ కూడా సింగరేణికి రావాలనేదే తమ తాపత్రయమని, ఈ టెండర్లనుంచి జెన్‌కో వెనక్కు తగ్గి దీన్ని సింగరేణికి ఇచ్చేలా చొరవతీసుకోవాలని కోరారు. నైని, తాడిచర్ల 2, పీకేవోసీ బ్లాక్‌ల ద్వారా దాదాపు 6,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, సుమారు 830 మిలియన్ టన్నుల బొగ్గు సింగరేణికి ఉత్పత్తి అవుతుందన్నారు.

వీటి ద్వారా రూ. లక్షా 95వేల కోట్ల టర్నోవర్ సింగరేణికి వస్తుందన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 40వేల కోట్ల లాభం వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణికి ఈ బ్లాక్ కట్టబెట్టాలని, ఈ బ్లాక్ జెన్‌కోకు వెళ్లకుండా నిర్ణయం తీసుకోవాలని రేపు ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తానని’ చెప్పారు. 

పార్లమెంటులో సహకరించని కాంగ్రెస్ 

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు - పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, 2024లోనే ఈ బిల్లును తీసుకొచ్చామని, ఇవాళ దీనిలో మరిన్ని కఠినమైన మార్పులు జోడించిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు స్వాగతం పలికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందో పోయి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370, డిజిటల్ ట్రాన్సాక్షన్, రైతు చట్టాల వంటి ఎన్నో చట్టాలను కాంగ్రెస్, విపక్షాలు అడ్డుకుంటున్నాయని, ఈ బిల్లుకైనా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని అనుకుంటే  కాంగ్రెస్ తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరిచి మాట్లాడుతోందని, తెలంగాణ ఉద్యమంలో.. జై తెలంగాణ అన్న పాపానికి.. 369 మందిని పోలీసు తూటాలతో కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో.. ఇలాగే కాల్చి చంపిందని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దీనిపై మాట్లాడాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యపద్ధతిలో వ్యవహరిస్తోందని, రైతు చట్టాల సమయంలోనూ.. రైతులతో మాట్లాడి బిల్లును వెనక్కు తీసుకుందన్నారు. మొన్నటి విద్యార్థుల ఉద్యమంలోనూ సంయమనంతో వ్యవహరించామని, వారితో నిర్మాణాత్మకమైన చర్చలు జరిపామన్నారు. దేశం ఏమైనా పర్వాలేదు.. మోదీ గద్దె దిగాలి, నెహ్రూ కుటుంబం గద్దెనెక్కాలనే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. 

పేపర్ లీకులపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమా? 

రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టడం హాస్యాస్పదమని, విద్యార్థులు తమ ధర్నాను విరమించుకుంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేకపోయిందన్నారు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ హింస జరగలేదని కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ బాధపడుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాహుల్, రేవంత్, మల్లికార్జున ఖర్గే నీతిసూత్రాలు వల్లెవేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో చెప్పగలరా? దీనిపై పార్లమెంటులో చర్చకు సిద్ధమా? బిల్లుపై చర్చలో పాల్గొని.. గొంతు వినిపించే ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

కేటీఆర్ ధర్నాచౌక్ లో పేపర్ లీక్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ధర్నాచౌక్‌లో నిరసనలపై నిషేధం విధించిన వ్యక్తి ఉద్యమాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి కూడా తమ హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీక్‌పై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రియాంక గాంధీ స్వయంగా.. లీకేజీ మామూలే, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో జరిగింది సహజమైన విషయమే అని మాట్లాడారని, కానీ ఇవాళ ఆమె పార్లమెంటు లోపలా, బయటా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరిధిలో విదేశాల నుంచి డబ్బులు రావచ్చు... ఇబ్బందిలేదు... కానీ దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.