కేసీఆర్ హయాంలో అద్భుత అభివృద్ధి.. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం
- బీఆర్‌ఎస్ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, సెప్టెంబరు 1 (విజయ క్రాంతి): కేసీఆర్ హయాంలో అద్భుత అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పాలనలో తిరోగమనం దిశగా సాగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Former Minister and MLA Gangula Kamalakar) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో టిఆర్‌ఎస్ వారం రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు రోజుల్లోపే 120 కోట్లతో కరీంనగర్ సిటీ రేనోవేషన్ పేరుతో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని అన్నారు. అర్హత లేకున్నా కరీంనగర్కు ’స్మార్ట్ సిటీ’ హోదాను సాధించి, వందల కోట్లు వెచ్చించి నందనవనంలా తీర్చిదిద్దామన్నారు.2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అలవి కాని హామీలనిచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, గడచిన రెండున్నరేళ్లలో కనీసం అభివృద్ధి జాడే లేదని ధ్వజమెత్తారు. పాలనలో అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, ముఖ్యమంత్రి మాట మంత్రులు వినడం లేదని, మంత్రుల మాట ఎమ్మెల్యేలు వినడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా, 22ఏ సెక్షన్ కింద కోటి 25 లక్షల ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో చేర్చారని.. అందులో భాగంగా కరీంనగర్లోని రేకుర్తి, సీతారాంపూర్, చింతకుంట, కొత్తపెళ్లి తదితర ప్రాంతాల ప్రైవేటు భూములను కూడా 22ఏ సెక్షన్ కింద చేర్చడం వెనుక వారి అక్రమ సంపాదన దాగుందని ఆరోపించారు. మరోవైపు, జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు లేవని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు ఈనెల 2 నుంచి 8 వరకు చేపట్టే వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 3న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 22ఏ నిషేధిత భూముల బాధితులతో కలిసి తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్చార్జి కొండూరు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






