సమానత్వ సాధనకు సామాజిక యజ్ఞం చేసిన వ్యక్తి అంబేద్కర్
ములకలపల్లి,(విజయక్రాంతి): అవమానాల చీకటి నుంచి ఆత్మగౌరవ శిఖరాల వైపు సాగిన ఒక మహా ప్రస్థానం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అని మూకమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి అన్నారు. ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆమె పాల్గొని ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ అంటరానితనం అనే సామాజిక జాడ్యంపై అక్షరాన్నే ఆయుధంగా మలచి యుద్ధం చేసిన విశిష్ట విప్లవమూర్తి, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని రాజ్యాంగం ద్వారా ప్రకటించినప్పటికీ, సామాజికంగా అందరూ సమానత్వపు గాలిని పీల్చుకున్నప్పుడే దేశానికి నిజమైన స్వేచ్ఛ సిద్దిస్తుందని విశ్వసించారని, కులం గోడలు లేని, అసమానతలు దరిచేరని నవ సమాజం కోసం కలలు కని,దానిని సాకారం చేసుకోవడానికి జీవితాంతం తపించారు.
ఆ దార్శనికుడి పోరాట పటిమను,కుల నిర్మూలన దిశగా ఆయన సాగించిన బహుముఖ కృషిని,సామాజిక యజ్ఞాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రెటరీ కేసుపాక శ్రీనివాసరావు,వార్డు సభ్యులు భూక్య అశోక్,శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు,రాయల సాంబశివరావు, రింగు బాలకృష్ణ, గడ్డం వెంకటేష్ బత్తుల వెంకటేష్, సున్నం శ్రీను, కోర్సా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






