బాబాసాహెబ్ ఆశయాలు సమాజానికి దిక్సూచి
ప్రజా హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు భీమ్
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్
సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నేటి సమాజానికి దిక్సూచి వంటివని, ఆయన చూపిన మార్గంలో నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు.
మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీసు సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై తొలుత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప మహనీయుడు భీమ్ అని కొనియాడారు. కుల వివక్ష లేని భారతదేశాన్ని నిర్మించాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యమని, అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఫలాలను సమాజంలోని అట్టడుగు వర్గాల అందరికీ చేరవేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ నేటి యువత బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఉద్ఘాటించారు.
శేషగిరి భవన్‌లో..
సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని, ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, గనిగళ్ల వీరాస్వామి, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.






