16 March, 2026 | 4:42 AM

కిష్టారం గ్రామసభలో రభస

16-03-2026 12:03 AM

గ్రామ సభలో అంబేద్కర్ నగర్ శైలో బంకర్ బాధితుల ఆందోళన. 

గ్రామస్తుల నిర్ణయం మేరకు నడుచుకోవాలని సింగరేణి అధికారులకు మట్టా దయానంద్ సూచన

సత్తుపల్లి, మార్చి 15:( విజయక్రాంతి): మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో సర్పంచ్ నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో గ్రామంలో ఏర్పాటు చేసిన సింగరేణి ఉన్నత అధికారుల గృహ సముదాయాలకు గ్రామం మీదుగా 32 కె.వి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని దానికి గ్రామస్తులు సహకరించాలని సింగరేణి అధికారులు ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనను గ్రామస్తులు ముక్తకంఠంతో నిరాకరించారు. తమ గ్రామం మీదుగా అధిక తీవ్రత గల విద్యుత్ తీయగలను ఏర్పాటు చేయవద్దని, సింగరేణి కార్యకలాపా లతో తమ గ్రామం తీవ్రంగా నష్టపోయిందని, కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమపై విద్యుత్ రేడియేషన్ తో మరో ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి అధికారులకు తేల్చి చెప్పారు. 

గ్రామ సభకు హాజరైన అంబేద్కర్ నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ మూడు నెలలలో ఎస్సీ,బీసీ కాలనీలకు శైలో బంకర్ సమస్య నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తామని 34 రోజుల మహా ధర్నాను సింగరేణి అధికారులు, ప్రభుత్వ నాయకులు విరమింప చేశారని, సంవత్సరం గడిచిన తమ సమస్యకు పరిష్కారం లేదని ఆందోళనకు దిగారు.  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఆ సంస్థకు భూగర్భ నిక్షేపాలు త్రవ్వి తీసుకోవడంపై ఎంత అధికారం ఉందో తవ్వకాలలో నష్టపోయిన బాధితులను ఆదుకునే బాధ్యత అంతకంటే ఎక్కువ ఉన్నదని గుర్తు చేశారు.

ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని సింగరేణి అధికారులకు సూచించారు. అంబేద్కర్ నగర్ శైలో బంకర్ కాలుష్యం సమస్య గురించి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఈనెల జరగనున్న శాసనసభ సమావేశాలలో మరోసారి ప్రస్తావించి జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని దయానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జే.వి.ఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్, ఎలక్ట్రికల్ ఏ.ఈ శరత్, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.