1 May, 2026 | 2:14 AM

మైనర్ అబార్షన్ కేసులో చట్టాలను మార్చండి

01-05-2026 12:56 AM
  1. లైంగికదాడి బాధితుల గర్భస్రావ చట్టంపై కేంద్రానికి సుప్రీం సూచన
  2. ఢిల్లీ ఎయిమ్స్ పిటిషన్‌పై కోర్టు తీవ్ర అభ్యంతరం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: లైంగికదాడి కారణంగా గర్భం దాల్చినప్పుడు, అబార్షన్ చేయించుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి అనేది ఉం డకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొం ది. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టం ఉండాలని తెలిపింది. ఈ మేరకు లైంగికదాడి బాధితుల గర్భస్రావానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. 30 వారాల (ఏడున్నర నెలల) గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి 15 ఏళ్ల బాలిక కు అనుమతులిస్తూ ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగికదాడి బాధితులు అవాంఛిత గర్భాలను 20 వారా లు దాటిన తర్వాత కూడా తొలగించుకోవడానికి అనుమతించేలా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాన్ని సవరించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ‘ఇదొక బాలిక లైంగికదాడి కేసు.

ఇదొక క్యూరేటివ్ పిటిషన్. ఒకవేళ అబార్షన్ చేసుకునేందుకు అనుమతించకుంటే, ఆ ఘటన బాధితురాలిని జీవితాంతం మానసికంగా వెంటాడుతుంది. ఈ మానసిక క్షోభతో ఆమె కడదాకా కుమిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అవాంఛిత గర్భాన్ని ఒక వ్యక్తిపై ఎవరూ బలవంతంగా రుద్దలేరు. పైగా ఈ కేసులో బాధితురాలు ఒక బాలిక. ఆమె ఇప్పుడు చదువుకుంటోంది. కానీ మనం ఈ బాలికను తల్లికావాలని చెబుతు న్నాం. ఈ క్రమంలో ఆ బాలిక ఎంత బాధను, అవమానాన్ని అనుభవించిందో ఒక్కసారి ఊహించండి.

ఈ కేసులో బాధిత బాలికలకు శాశ్వత వైకల్యమేదీ ఏర్పడే ముప్పు లేకపోతే, అబార్షన్ చేయాలి’ అని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. ఢిల్లీ ఎయిమ్స్ తరఫున అడిషన ల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటీ వాదన లు వినిపించారు. ఈ దశలో బాధిత బాలికకు అబార్షన్ చేయడం చట్టపరంగా వీలు కాదని ఆమె సుప్రీంకోర్టు బెంచ్‌కు తెలిపారు. ఇప్పుడు అబార్షన్ చేస్తే తీవ్ర వైకల్యాలతో కూడిన శిశువు జన్మిస్తుందని చెప్పారు. దీంతోపాటు బాధిత బాలికకు జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఆమె సంతానం కన లేదని ఐశ్వర్యా భాటీ పేర్కొన్నారు.

దత్తతకు ఇవ్వడానికి మనదేశంలోని వీధుల్లో అనాథలుగా వదిలేసిన పిల్లలు చాలామందే ఉన్నారని వ్యాఖ్యానించింది. చివరకు అనాథ పిల్లలపై మాఫియా ముఠాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపింది. అలాంటి పిల్లల సంక్షేమంపై, దత్తత ఇవ్వడంపై మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకో ర్టు పేర్కొంది.

ఈ కేసులో మాత్రం అబార్షన్ నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేయాలని ఎయిమ్స్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ దశలో అబార్షన్ చేయడం వల్ల తలెత్తే ప్రతికూల పర్యవసానాల గురించి బాలికకు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని దిల్లీ ఎయిమ్స్‌కు సూచించింది. అయితే తుది నిర్ణయాన్ని బాధితురాలే తీసుకోవాల్సి ఉంటుం దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.